‘బాహుబలి’కి టాటా చెప్పేసిన జక్కన్న

ఇప్పటిదాకా ఇండియాలో ఏ స్టార్ డైరెక్టర్ కూడా ఒక్క సినిమా కోసం ఐదారేళ్లు వెచ్చించి ఉండడేమో. ‘బాహుబలి’తో రాజమౌళి ఆ సాహసం చేశాడు. ‘ఈగ’ విడుదల కావడానికంటే ముందు ‘బాహుబలి’ పనులు మొదలుపెట్టిన రాజమౌళి.. ఐదేళ్లకు పైగా ఆ ప్రపంచంలోనే ఉండిపోయాడు.

ఎట్టకేలకు ఈ ఏడాది ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బాహుబలి కథ ముగిసింది. ఈ సినిమా షూటింగ్ నాలుగు నెలల ముందే పూర్తయినప్పటికీ.. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లతో బిజీ బిజీగా గడిపాడు జక్కన్న. ఎట్టకేలకు పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు కూడా ముగిశాయి.

బాహుబలి-2 విడుదల తర్వాత రాజమౌళి తన టీంతో కలిసి ప్రమోషన్ కోసం లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాక తన బృందంతో కలిసి ఒక సెల్ఫీ దిగి.. ట్విట్టర్లో పెట్టాడు జక్కన్న. ‘బాహుబలి’తో తన ప్రయాణం ఇంతటితో ముగిసిందంటూ ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు రాజమౌళి. ‘బాహుబలి’ లాంటి సినిమాతో బంధాన్ని తెంచుకోవడం ఎవ్వరికైనా ఎంతో భావోద్వేగంతో కూడుకున్న విషయమే.

ఐదేళ్ల పాటు ఎంతో శ్రమించి ఈ సినిమా తీయడం ఒకెత్తయితే.. అది సాధించిన విజయం.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుండటం మరో ఎత్తు. ఐతే ‘బాహుబలి’తో రాజమౌళి ప్రయాణం ముగిసినప్పటికీ.. ఈ సినిమాతో ఆయన వేసిన ముద్ర అన్నది మాత్రం భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ అలా నిలిచి ఉంటుందనడంలో మాత్రం సందేహం లేదు.


Recent Random Post: