
అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ముందు అనుకున్నట్లుగా మే 19న విడుదల కావట్లేదని.. ఈ సినిమాకు రీషూట్లు, రిపేర్లేవో జరుగుతున్నాయని.. సినిమా వాయిదా పడటం పక్కా అని కొన్ని రోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఐతే రిపేర్ల సంగతేమో కానీ.. సినిమా వాయిదా పడుతుందన్న ప్రచారం మాత్రం ఉత్తదే అంటున్నాడు నిర్మాత అక్కినేని నాగార్జున.
‘రారండోయ్..’ వాయిదా అంటూ ఒక జర్నలిస్టు పెట్టిన ట్వీట్‌ను ఉద్దేశించి ఆయన స్పందించాడు. ఇదంతా అబద్ధం అని.. ఏదైనా ఉంటే తనను నేరుగా సంప్రదించమని ట్విట్టర్లో రెస్పాండయ్యాడు నాగ్. మరో పత్రికలో వచ్చిన ఇలాంటి వార్తనుద్దేశించి కూడా నాగ్ స్పందించాడు. మరో తప్పుడు వార్త అని ట్వీట్ చేశాడు. అంటే అనుకున్నట్లుగానే మే 19న ‘రారండోయ్..’ ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నట్లే అన్నమాట.
‘సోగ్గాడే చిన్నినాయనా’తో దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ‘సోగ్గాడే..’ విడుదలకు ముందు కూడా రీషూట్లని.. రిపేర్లని చాలా వార్తలొచ్చాయి. ఈ విషయంలో నాగార్జునే ఖండనివ్వలేదు. రీషూట్లు జరిగిన మాట వాస్తవమే అన్నాడు.
ముందే తప్పులు సరిదిద్దుకుంటే తప్పేంటి అని ప్రశ్నించాడు. ‘సోగ్గాడే..’ బ్లాక్ బస్టర్ కావడంతో నాగ్ మాటతో అందరూ ఏకీభవించారు. మరి ‘రారండోయ్..’ విషయంలోనూ అలాగే జరుగుతోందేమో.. ఈ విషయాన్ని నాగ్ తర్వాత అంగీకరిస్తాడేమో చూడాలి.
Recent Random Post:

















