
మన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’తో 150 సినిమాల మైలురాయిని అందుకున్నాడు. దానికి మంచి రిజల్ట్ కూడా వచ్చింది. మరోవైపు కోలీవుడ్‌లోనూ ఒక సీనియర్ హీరో 150 మార్కును అందుకోబోతుండటం విశేషం.
ఆ హీరో మరెవరో కాదు.. యాక్షన్ కింగ్ అర్జున్. గత కొన్నేళ్లలో పెద్దగా లైమ్ లైట్లో లేని అర్జున్.. 150వ సినిమాను మాత్రం ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాడు. ఆ సినిమా పేరు.. నిబునన్. గత ఏడాది రిలీజైన దీని ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్‌తోనూ మెప్పించాడు యాక్షన్ కింగ్. తమిళంలో ‘అచ్చముండు అచ్చముండు’ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన అరుణ్ వైద్యనాథన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
కెరీర్లో లెక్కలేనన్ని పోలీస్ సినిమాలు చేసిన అర్జున్.. తన 150వ సినిమాలోనూ పోలీస్ క్యారెక్టరే చేస్తుండటం విశేషం. ఒక సైకో కిల్లర్ సొసైటీలో బిగ్ షాట్స్ అయిన ముగ్గురిని హత్య చేస్తాడు. ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరని ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు అర్జున్. టీజర్ చూస్తే చాలా ఉత్కంఠభరితంగా కనిపిస్తోంది. గత కొన్నేళ్లలో తమిళంలో వచ్చిన మంచి మంచి థ్రిల్లర్ల జాబితాలో ‘నిబునన్’ కూడా నిలిచేలా కనిపిస్తోంది.
ఈ చిత్రంలో స్నేహ భర్త ప్రసన్న, కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్, శరత్ కుమార్ తనయురాలు వరలక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళం.. కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. అర్జున్‌కు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని మన దగ్గరా రిలీజ్ చేస్తారట.
https://www.youtube.com/watch?v=votHLafIJlU
Recent Random Post:

















