ఈ డ్రామా కోసమే శృతికి డబ్బులిచ్చారా?

‘సంఘమిత్ర’ చిత్రం అనౌన్స్‌మెంట్‌ కోసమే శృతిహాసన్‌ కేన్స్‌ చిత్రోత్సవాలకి వెళ్లిన సంగతి తెలిసిందే. బాహుబలిని మించిన సినిమా తీసేస్తున్నామని మామూలుగా ప్రకటిస్తే ఎవరూ పట్టించుకోరేమో అన్నట్టు సరాసరి కేన్స్‌కి వెళ్లి సంఘమిత్ర అనౌన్స్‌ చేసారు. టైటిల్‌ రోల్‌ చేయడానికి శృతిహాసన్‌ కత్తిసాము నేర్చుకుంటోందని, స్పెషల్‌ ట్రెయినర్‌ని పెట్టుకుందని కూడా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌లు, ఫోటోలు కూడా విడుదల చేసారు.

ఇంతవరకు బాగానే వుంది కానీ, సడన్‌గా ఈ చిత్రం నుంచి శృతిని తప్పిస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. ఆమెతో ప్రొఫెషనల్‌ ఇబ్బందులు తలెత్తాయని నిర్మాతలు ఆరోపిస్తే, అసలు వారి దగ్గర కథే లేదని, ఎప్పుడు మొదలవుతుందో తెలియని సినిమాకి రెండేళ్లు డేట్స్‌ ఎలా కేటాయిస్తానని శృతిహాసన్‌ అడిగింది. అయితే ఈ వ్యవహారం మొత్తం పెద్ద డ్రామాని తలపిస్తోందనే కామెంట్స్‌ పడుతున్నాయి.

ఫలానా సినిమా తీస్తున్నామంటూ కేన్స్‌లో అనౌన్స్‌ చేయగానే పెద్ద స్టూడియోలు వచ్చి తమతో భాగస్వామ్యం తీసుకుంటాయని, తద్వారా భారీ చిత్రాన్ని మొదలు పెట్టవచ్చునని నిర్మాతలు భావించారని, అందుకే శృతిహాసన్‌కి అడ్వాన్స్‌ ఇచ్చి ఆమెతో సందడి చేయించారని, తీరా సుందర్‌ .సి సినిమా అనేసరికి ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ ముందుకి కదలలేదని లాజిక్‌తో కొడుతున్నారు. అంత హంగామా చేసి ఇంతవరకు కథ కూడా రాసుకోకపోవడం చూస్తే, ఇంతవరకు ముప్పయ్‌ కోట్ల బడ్జెట్‌ వున్న సినిమా తీయని సుందర్‌తో నాలుగు వందల కోట్ల సినిమా అనడాన్ని వింటే ఇదంతా డ్రామానే అని తేల్చేస్తున్నారు. ఈ ఆరోపణలు తప్పించుకుని గౌరవం కాపాడుకోవాలంటే శృతి స్థానంలో మరొకరిని తీసుకుని త్వరగా ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకి తీసుకెళ్లాలి.


Recent Random Post: