
నవనిర్మాణ దీక్ష మూడో రోజు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభ సాగుతున్న నేపథ్యం అయి ఉండవచ్చు లేదా కాకతాళీయం కావచ్చు కానీ…విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో నవనిర్మాణ దీక్ష మూడోరోజు చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మన పొట్టే కొట్టారని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ విభజనను అన్యాయంగా చేసి నాడు పొట్ట కొట్టారని, నేడు హోదా పేరుతో నయవంచన చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని అందరమూ కలిసి ఎదుర్కొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఏపీ ప్రజలను కాంగ్రెస్ అవమానించిందని చంద్రబాబు ఆరోపించారు. కాంగ్రెస్ వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా, ఇష్టానుసారంగా విభజించారని కనీసం రాజధాని కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు అన్యాయం చేయొద్దని నేతలందరినీ కలిశానని తెలిపిన చంద్రబాబు మనకు అన్యాయం జరుగుతుంటే ఒక్కరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఇప్పుడు ఒక్కోక్క అడుగు ముందుకేస్తున్నామని తెలిపారు.
దక్షిణాదిలో తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని వ్యాఖ్యానించారు. ప్రజలందరూ క్రమశిక్షణతో మెలిగితేనే అభివృద్ధి వైపు వెళ్ల గలుగుతామని సూచించారు. వ్యవసాయం-అనుబంధ రంగాలు, జల సంరక్షణపై తమ ప్రభుత్వం ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దామని, ఇతర రాష్ట్రాలతో పోటీపడి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని బాబు చెప్పారు. అదే రీతిలో అమరావతిని తీర్చిదిద్దేందుకు ముందుకు సాగుతున్నట్లు ప్రకటించారు.
Recent Random Post: