ట్రంప్‌ను తొలిరోజే టార్గెట్ చేస్తార‌ట‌

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఈనెల 20వ తేదీన డొనాల్డ్‌ ట్రంప్‌ పదవీ బాధ్యతలను స్వీకరించే సమయంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని అమెరికన్‌ ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. జాతివివక్ష, దురహంకారం నిలువెల్లా నిండిన ట్రంప్‌ అణ్వాయుధ పోటీకి తెరతీసే ప్రమాదం ఉందని ఈ నిరసన ప్రదర్శనల నిర్వాహకుల బృందం జె20 తెలిపింది.

జనవరి 20వ తేదీ ఉదయర ఆరు గంటలకు వాషింగ్టన్‌ యూనియన్‌ స్టేషన్‌ ఎదుట ఈ నిరసన ప్రదర్శనకు తరలిరావాలని జె20 నిర్వాహకులు పిలుపునిచ్చారు. అక్కడి నుండి ఉదయం 10 గంటలకు వైట్‌హౌస్‌కు నిరసన ప్రదర్శన ప్రారంభమవుతుందన్నారు.

ఇదిలాఉండ‌గా…అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే తొలి రోజునే డొనాల్డ్ ట్రంప్ అనేక సంచలనాలకు తెరతీసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న అనేక నిర్ణయాలను ట్రంప్ రద్దుచేసే అవకాశముందని ఆయన కీలక సలహాదారు సియాన్ స్పైసర్ వెల్లడించారు. శ్వేత‌సౌధంలోకి అడుగుపెట్టే తొలి రోజునే ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకోనున్నారని ఒబామా చేపట్టిన చర్యల వల్ల ఆర్థిక వృద్ధి మందగించడంతోపాటు ఉపాధి కల్పన కూడా దెబ్బతినడమే ఇందుకు కారణమని వెల్లడించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఒబామా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను సమీక్షించిన అనంతరం వాటిని ట్రంప్ రద్దుచేస్తారని తెలిపారు.

అయితే ఈ ఎనిమిదేళ్లలో ఒబామా అనేక నిర్ణయాలు తీసుకున్నందున వాటిలో వేటిని ట్రంప్ రద్దుచేయబోతున్నారన్న దానిపై ఇప్పటికిప్పుడే ఎలాంటి స్పష్టత లేదు. ముఖ్యంగా ఇమిగ్రేషన్, ఇంధన నియంత్రణ, విదేశాంగ విధానాలకు సంబంధించి ఒబామా తీసుకున్న అనేక నిర్ణయాలకు ట్రంప్ తిలోదకాలివ్వడం ఖాయమని స్పష్టమవుతోంది.


Recent Random Post: