
రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన రామ్ నాథ్ కోవింద్ మంగళవారం హైదరాబాద్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ అధికారపక్షంతో పాటు.. ఏపీ విపక్ష నేతల్ని.. బీజేపీ నేతలతోనూ భేటీ అయ్యారు. జగన్ పార్టీ ఎంపీలు.. ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
దళిత వర్గానికి చెందిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఆయన కాళ్లకు మొక్కటం.. ఆ తర్వాత కాసేపటికి జగన్ కు అత్యంత సన్నిహితుడు.. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సైతం ఆయన కాళ్లకు మొక్కటం అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. అదో హాట్ టాపిక్ గామారింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి అభ్యర్థితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత.. గిరిజన ఎమ్మెల్యేలు ఆయనతో ఫోటోలు దిగేందుకు చేసిన ప్రయత్నం జగన్ కు చిరాకు తెప్పించటమే కాదు.. తీవ్ర ఆగ్రహానికి గురి చేసినట్లుగా తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కోవింద్ కాళ్లకు జగన్ మొక్కిన తర్వాత.. ఆయనకు తాము సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. ఇదంతా జరిగిన తర్వాత తమకు అడుగు దూరంలో ఉన్న కోవింద్ తో ఫోటో దిగేందుకు జగన్ పార్టీకి చెందిన దళిత.. గిరిజన ఎమ్మెల్యేలు ఆసక్తి కనపర్చారు. కానీ.. వారి ప్రయత్నం ఫలించలేదు.
ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రమంత్రి వెంకయ్య.. అరెరే.. ఆయన వెళ్లిపోయారే అంటూ తనతో ఫోటో దిగేందుకు పిలిచారు. నిజానికి జగన్ పార్టీ ఎమ్మెల్యేల ఉద్దేశం వెంకయ్యతో ఫోటో దిగటం ఎంత మాత్రం కాదు.
అలా అని.. ఆ విషయాన్ని ఆయన ముఖాన చెప్పలేరు కాబట్టి.. మొహమాటానికి ఆయనతో ఫోటోలు దిగేశారు. ఇది జగన్‌కు ఏ మాత్రం నచ్చలేదని చెబుతున్నారు. వెంకయ్యతో ఫోటోలు దిగటం ఏమిటంటూ క్లాస్ పీకటమే కాదు.. లోటస్ పాండ్‌కు పిలిచి మరీ చిందులు వేసినట్లుగా చెబుతున్నారు. పార్టీ ప్లీనరీ గురించి మాట్లాడాలంటూ ఆఫీస్‌కు పిలిపించుకున్న జగన్.. కోవింద్ తో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం ప్రదర్శించిన ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై జగన్ ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. “ఆయనేమో కాళ్లకు మొక్కుతారు.. మేం కనీసం ఫోటోలు దిగటం కూడా తప్పేనా? ఇదెక్కడి పద్దతి. ఎమ్మెల్యేలన్న మర్యాద కూడా ఉండదా? ఎంత.. అధినేత అయితే మాత్రం.. కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడేస్తారా? అనుచిత వ్యాఖ్యలు చేస్తారా?” అంటూ సన్నిహితుల దగ్గర వాపోయినట్లుగా చెబుతున్నారు.
Recent Random Post: