బాబు ఈ విష‌యంలో సూప‌ర్ అంటున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో కొత్త టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీ అయిన తెలుగుదేశం పార్టీతో పాటుగా రాజ‌కీయ‌వ‌ర్గాల నుంచి సైతం బాబు తీరుపై ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం గ‌తంలో బాబుపై ఉన్న దుర‌భిప్రాయ‌మే. త‌న‌ను న‌మ్ముకున్న వాళ్ల‌కు బాబు ఏమీ చేయ‌ర‌నే భావ‌న ఉండేది అయితే గతానికి భిన్నంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని పార్టీ శ్రేణుల్లో మరింత విశ్వసనీయత పెంచుకుంటున్నారని ఇటీవ‌ల ప‌రిణామాలను ప‌లువురు విశ్లేషిస్తున్నారు. తన పార్టీలో చేరిన వారికి గౌరవం ఉంటుందని చెప్పడంతోపాటు, పార్టీ కోసం పనిచేస్తున్న వారికి గుర్తింపు ఇస్తామన్న సంకేతాలతో సమతుల్యత సాధించే పనిలో ఉన్నారు. గతంలో దీనిపై తన మీద శ్రేణులకు ఉన్న దురభిప్రాయాన్ని చెరిపేసుకుని నేతలలో నమ్మకం పెంచుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.

వైసీపీ నుంచి పార్టీలో చేరే ముందు కీలక నేతలకు ఇచ్చిన హామీల విష‌యంలో ఇది ప్ర‌ధానంగా క‌నిపించింద‌ని చెప్తున్నారు. సీనియ‌ర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఆయన మృతితో కుమార్తె అఖిలకు మంత్రి పదవి ఇచ్చారు. చిత్తూరు జిల్లా నుంచి మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, విజయనగరం జిల్లా నుంచి మంత్రి సుజయకృష్ణ రంగారావుకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. అయితే కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జవహర్‌కు మంత్రి పదవుల హామీ ఇవ్వకపోయినా అనూహ్యంగా వారిద్దరికీ క్యాబినెట్‌లో స్థానం కల్పించి విశ్వసనీయత పెంచుకున్నారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు హామీ ఇచ్చినప్పటికీ, ఆయన నోరుజారి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదం కావడంతో అదృష్టం వెక్కిరించింది. అయితే ఆయనను నిరాశపరచకుండా రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి ఇచ్చి సంతృప్తి పరిచారు. ఎలాంటి హామీ ఇవ్వని నాగుర్‌మీరాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. విపక్షంలో ఉండగా, వైఎస్ జగన్‌పై విరుచుకుపడిన వర్లరామయ్యకు హౌసింగ్ బోర్డు చైర్మన్, జూపూడికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జూపూడికి ఎమ్మెల్సీ ప్రకటించినప్పటికీ, సాంకేతికంగా ఆయన ఓటు హైదరాబాద్‌లో ఉండటంతో పదవి పోగొట్టుకోవలసి వచ్చింది. తాజాగా జగ్గంపేట సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు కుమారుడు నవీన్‌కు తూర్పు గోదావరి జడ్పీ చైర్మన్ పదవి ఖరారు చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ కార్యాలయం కేంద్రంగా పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న కార్యాలయ నాయకులందరికీ న్యాయం చేసి విశ్వసనీయత పెంచుకున్నారు. జాతీయ కార్యలయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్దన్, వివి చౌదరి, ఎం.ఏ.షరీఫ్‌కు ఎమ్మెల్సీ, తన మిత్రుడైన జయరామిరెడ్డి, సీఎల్ వెంకట్రావుకు కార్పొరేషన్ చైర్మన్, ఏవీ రమణకు ఏపీ పార్టీ ఆఫీసు ఇన్చార్జితోపాటు టీటీడీ మెంబరు, వేమూరి ఆనందసూర్యకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించారు. దీంతోపాటుగా తనకు మిత్రుడైన కరణం బలరామ్, తొలి నుంచీ పనిచేస్తున్న మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, పాదయాత్ర కంటే ముందు జరిపిన మీకోసం యాత్రలో కీలకపాత్ర పోషించిన యువనేత మంతెన సత్యనారాయణరాజు, వైఎస్ కుటుంబంపై పోరాడిన బీటెక్ రవి, చీరాలకు చెందిన బీసీ నేత పోతుల సుజాతకు ఎమ్మెల్సీ పదవులతో పాటు, శెట్టిబలిజ వర్గానికి చెందిన అంగర రామ్మోహన్‌రావుకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి, అదే వర్గానికి చెందిన రెడ్డి సుబ్రమణ్యంకు మండలి డిప్యూటీ చైర్మన్ అవకాశం ఇవ్వడం ద్వారా… బీసీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యం కల్పించారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజ-కాపు వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు.

పాదయాత్రలో తనతో కలసి నడిచిన కోటేశ్వరరావు, పీఆర్ మోహన్‌కు కార్పొరేషన్ చైర్మన్, బ్రింగ్ బాబు బ్యాక్ లీడర్ బ్రహ్మంచౌదరికి టూరిజం డైరెక్టర్, ప్రకాష్‌నాయుడుకు కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణకు చెందిన మాజీ జర్నలిస్టు శ్రీనివాస్‌కు ఢిల్లీలో ఓఎస్డీ, కొన్నేళ్లుగా మీడియా వ్యవహారాలు చూస్తున్న అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్‌కు గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవులిచ్చారు. పార్టీలో అత్యంత సీనియర్ నేత, మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజ్‌కు తాజాగా స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్, కొత్తగా వైసీపీ నుంచి చేరిన నంద్యాల నేత నౌమన్‌కు ఉర్దూ అకాడమి చైర్మన్, ఎమ్మెల్యే టికెట్ అవకాశం రాని అంబికాకృష్ణకు ఎఫ్‌డిసి చైర్మన్ పదవులివ్వడం ద్వారా తనపై మరింత నమ్మకం పెంచారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా ఎన్టీఆర్ వేషంలో వచ్చే వడ్డెర రాముకు టూరిజం డైరెక్టర్ ఇస్తామని హామీ ఇచ్చారు. శ్రీకృష్ణుడి వేషధారణతో రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన గుమ్మడి గోపాలకృష్ణకు నాటక అకాడమి చైర్మన్ ఇస్తున్నట్లు ప్రకటించారు.


Recent Random Post: