
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ మంత్రి అయిన వెంకయ్యనాయుడు ఉప రాష్టపతి పదవికి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేస్తున్న వెంకయ్య నాయుడు తను బాధ్యత వహిస్తున్న సమాచార, ప్రసార, పట్టణాభివృద్ధి శాఖలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కేబినెట్‌ను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల అంచనా వేస్తున్నాయి. ఈ రూపంలో బీజేపీలోని పలువురు సీనియర్లు, కొందరు ఆశావహులకు పదవులు ఖాయమని తెలుస్తోంది.
గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ తను బాధ్యత వహిస్తున్న రక్షణ శాఖకు రాజీనామా చేశారు. మరోవైపు బీజేపీ నేత అనిల్ దవే మరణంతో పర్యావరణ మంత్రిత్వ శాఖకు పూర్తిస్థాయి మంత్రి లేరు. ఈ రెండు శాఖలను అదనపు బాధ్యతగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి హర్ష్ వర్దన్‌లు నిర్వహిస్తున్నారు. తాజాగా ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయిన వెంకయ్యనాయుడు తాను నిర్వహిస్తున్న శాఖలకు రాజీనామా చేయడంతో కేంద్ర కేబినెట్ విస్తరణ అనివార్యమేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు కీలకమైన నాలుగు శాఖలైన రక్షణ, పట్టణాభివృద్ధి, పర్యావరణ, సమాచార ప్రసార సంబంధాల శాఖలు పూర్తి స్థాయి మంత్రులు లేకుండా కొనసాగడం సరికాదని భావిస్తూ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం పార్టీ నేతలను మంత్రివర్గంలో తీసుకోవచ్చునని తెలుస్తోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాతే ప్రధాని మోడీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను చేపట్టవచ్చునని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన అనంతరం అధికార పార్టీలోని సీనియర్లు, మిత్రపక్షాలకు చెందిన నాయకుల డాటా, వివిధ సమీకరణాలు లెక్కలోకి తీసుకొని ప్రధానమంత్రి నిర్ణయం ఉంటుందని సమాచారం.
Recent Random Post: