‘బిగ్ బాస్’లోకి పెళ్లి కాని అమ్మాయిని తేవాలట..

ఐదు రోజుల కిందట భారీ హంగామా మధ్య మొదలైంది తెలుగు ‘బిగ్ బాస్’. ఐతే ఈ షోను ఆసక్తికరంగా నడిపించేంత స్టామినా పార్టిసిపెంట్లకు ఉందా అంటూ చాలామంది వ్యక్తం చేసిన సందేహాలు నిజమయ్యేలాగే కనిపిస్తున్నాయి.

మూణ్నాలుగు రోజులకే ‘బిగ్ బాస్’ ఎపిసోడ్లు బోర్ కొట్టేస్తున్నాయి. హిందీ ‘బిగ్ బాస్’లో మాదిరి చెప్పుకోదగ్గ కాంట్రవర్శీలు.. రొమాన్స్‌లు.. డ్రామాలు తెలుగు ‘బిగ్ బాస్’లో కనిపించట్లేదు. ఎపిసోడ్లు చప్పగా సాగిపోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న వాళ్లలో అంతగా ఆసక్తి రేకెత్తించని పార్టిసిపెంట్లను బయటికి పంపేసి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒకరిద్దరు ఇంట్రెస్టింగ్ పార్టిసిపెంట్లను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకొస్తారన్న ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ప్రస్తుతం ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఉన్న యువ కథానాయకుడు ప్రిన్స్ వ్యాఖ్యలు చేశాడు. తనొక్కడే లీజర్‌గా ఉన్న సమయంలో ప్రిన్స్ కెమెరాల వైపు చూస్తూ ఓ విన్నపం చేశాడు. హౌస్‌లో అందరూ పెళ్లయిన అమ్మాయిలే ఉంటున్నారని.. వాళ్లంతా బోరింగ్ టాపిక్స్ మాట్లాడుతున్నారని.. పచ్చళ్ల గురించి.. వంటల గురించి చర్చలు పెడుతూ.. గొడవలు పడుతున్నారని.. తాను వాళ్లతో కనెక్టవ్వలేకపోతున్నానని.. బోర్ కొడుతోందని.. తనకు సరిపోయే పెళ్లికాని అమ్మాయిలెవరినైనా హౌస్‌లోకి తీసుకొస్తే బాగుంటుందని అన్నాడు ప్రిన్స్.

తాను జిమ్ చేయాలన్నా కూడా ఒక మోటివేషన్ అవసరం అవుతోందని.. కాబట్టి ఓ అమ్మాయిని హౌస్‌లో తీసుకొస్తే బాగుంటుందని అతనన్నాడు. మరి తేజస్వి మదివాడను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోనికి తెస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రిన్స్ ఆ దిశగా ముందే సంకేతాలిచ్చాడేమో అనిపిస్తోంది అతడి వ్యాఖ్యలు చూస్తే.


Recent Random Post: