
సంచలన నిర్ణయాలు తీసుకోవటంలో ప్రధాని మోడీ తర్వాతే ఎవరైనా. అందుకే.. ఏదైనా సాధ్యమేనన్న భావన దేశ ప్రజల్లో ఫిక్స్ అయ్యింది. గడిచిన మూడు నాలుగు రోజులుగా ఒక సిత్రమైన వీడియో ఒకటి వాట్సాప్ వేదికగా వైరల్ అవుతోంది. ఈ వీడియో సారాంశం ఏమిటంటే.. రూ.100.. రూ.50 నోట్లకు సంబంధించి పాత వాటిని రద్దు చేస్తున్నారని.. వాటిని ఫలానా టైంలోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొని మార్పుకోవాలన్నది సారాంశం.
ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా ఈ మధ్యన ఉలికిపాటుకు గురి చేసేందుకు వీలుగా సోషల్ మీడియా అందుబాటులోకి రావటంతో అత్యుత్సాహంతో ఎవరికి వారు తమ శక్తి మేర ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాటిల్లో నిజాలు తక్కువగా.. అబద్ధాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ప్రచారం జరిగిన వీడియో కూడా ఉత్తదే.
మోడీ పుణ్యమా అని దేశ ప్రజల్లో పెరిగిన ఉలికిపాటుకు తగ్గట్లే పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాన్ చేసిన రూ.వెయ్యి నోటను తిరిగి తీసుకొస్తున్నట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తలు నెలకు రెండు దఫాలు చొప్పున వస్తున్నాయి.
తాజాగా వెయ్యి నోటు మీద కలకలం రేగటం.. మళ్లీ వస్తున్నాయన్న వార్తలు జోరందుకున్న వేళ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. మళ్లీ రూ.వెయ్యినోటను తీసుకొచ్చే ఉద్దేశం కేంద్రానికి లేదని తేల్చి చెప్పారు.
గత ఏడాది నవంబరు 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ఆర్ బీఐ నిర్ణయాన్ని ప్రధాని మోడీ వెల్లడించటం తెలిసిందే. తాజాగా రూ.200 నోటును.. రూ.50 కొత్త నోటును మార్కెట్లోకి తెచ్చిన నేపథ్యంలో రద్దు చేసిన రూ.వెయ్యి నోటు అందుబాటులోకి వస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో.. దీనిపై కేంద్రం పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చినట్లుగా చెప్పాలి. సో.. వెయ్యి నోటు మళ్లీ వస్తుందన్న మాట ఎవరైనా చెబుతుంటే అస్సలంటే అస్సలు వినాల్సిన అవసరమే లేదు.
Recent Random Post: