
నీలిమ తిరుమలశెట్టి గుర్తుందా..? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘పంజా’ సినిమాను ప్రొడ్యూస్ చేసిన నిర్మాతల్లో ఒకరు. ఆ సినిమా ఆడకపోయినా.. నిర్మాతగా నీలిమకు మంచి పేరే వచ్చింది. ఈ సినిమా తర్వాత ‘అలియాస్ జానకి’ అనే ఇంకో సినిమాను కూడా నిర్మించింది నీలిమ. ఆ తర్వాత వేరే హీరోను పెట్టి ‘పంజా’ సీక్వెల్ చేయబోతున్నట్లు ప్రకటించింది కానీ.. అది పట్టాలెక్కలేదు.
ఐతే కొన్నేళ్లుగా అసలు వార్తల్లో లేని నీలిమ.. నిన్న రాత్రి చేసిన ఒక ట్వీట్ కలకలం రేపింది. ”పవన్ కళ్యాణ్ గారూ ప్లీజ్ హెల్ప్ మి” అంటూ ట్విట్టర్లో మెసేజ్ పెట్టి సైలెంటైపోయింది నీలిమ. పవన్‌ను ట్యాగ్ కూడా చేసిందామె.
ఇక అంతే.. ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది. నీలిమకు ఏమైందంటూ ఒకటే ఆరాలు మొదలయ్యాయి. ఏమైందో చెప్పమని.. అవసరమైతే తాము ఆదుకుంటామని పవన్ అభిమానుల్లో వందల కొద్దీ మెసేజ్‌లు పెట్టారు. మరోవైపు ‘పంజా’ మిగిల్చిన నష్టాల నుంచి నీలిమ ఇంకా బయటపడలేదని.. అందుకే ఆమె పవన్‌ను సాయం చేయమంటూ అర్థించిందంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఐతే ఎవరెంతగా ప్రశ్నలు వేసినా.. సెటైర్లు వేసినా.. నీలిమ తర్వాత స్పందించలేదు. ఇంతకీ నీలిమకు ఏమైందో ఏమో కానీ.. పవన్‌ను ట్యాగ్ చేస్తూ నీలిమ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఆయన ఏమైనా స్పందిస్తాడేమో.. ఆమెను ఆదుకుంటాడేమో చూద్దాం.
Recent Random Post: