
రామ్గోపాల్ వర్మ రూటే సెపరేటు. దేన్నీ ఆయన అంత తేలిగ్గా వదిలేయడు. ఒకప్పటి వర్మ వేరు, ఇప్పటి వర్మ వేరు. ఇప్పుడు ప్రతీదాన్నీ తెగేదాకా లాగుతున్నాడాయన. అందులోంచి వచ్చే పబ్లిసిటీ, ఆ పబ్లిసిటీ ఇచ్చే కిక్ అలాంటివి మరి. అందుకే, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా నిర్మిస్తున్నట్లు వర్మ ప్రకటించేశాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జయలలిత మరణంపై సినిమా తీస్తానని గతంలో ప్రకటించిన వర్మ, ఆ సినిమా అంత ‘కిక్’ ఇవ్వదనుకున్నాడేమో, దాన్ని పక్కన పెట్టేశాడు. అన్నట్టు, ‘నయీమ్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించాలనుకున్నాడు. దాన్నీ అటకెక్కించేశాడాయన.
ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మాంఛి కిక్ ఇస్తోంది వర్మకి. ఏంటీ, ఇంకా సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు కదా.. అంటారా.? అదే మరి, వర్మ ప్రత్యేకత. మామూలుగా ఓ సినిమా అనౌన్స్ చేయడం, ఆ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్ళడం వర్మకి చాలా తేలిక. చకచకా వర్మ సినిమాలు తెరకెక్కించేయగలడు. కానీ, ఎప్పుడో ఫిబ్రవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్ళే సినిమాకి, ఇప్పటినుంచే పబ్లిసిటీ పోగేస్తున్నాడాయన.
ఎన్టీఆర్ జీవిత చరిత్ర, అందులోనూ లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ఎంటరయ్యాక కథ.. అంటే, కావాల్సినంత ‘మసాలా’ అందులో దాగి వుంటుంది. సహజంగానే టీడీపీ నేతలకిది చిరాకు తెప్పిస్తోంది. అదే వర్మకు కావాల్సింది. నిర్మాతగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేని వర్మ ఎంచుకోవడంలోనే ఆయన ‘స్ట్రాటజీస్’ అర్థమయిపోతాయి. వివాదాలు వర్మకి కొత్తేమీ కాదు. కానీ, సోషల్ మీడియా వేదికగా, తనను విమర్శించే ప్రతి ఒక్కరికీ ఆయన సమాధానం చెప్పుకుంటూ వెళుతున్నాడు.
మంత్రి సోమిరెడ్డి, వర్మని విమర్శిస్తే.. సోమిరెడ్డి చేసిన ప్రతి వ్యాఖ్యకీ వర్మ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యే అనిత విషయంలోనూ అంతే. ఆఖరికి వాణి విశ్వనాథ్కీ అదే తరహాలో వర్మ వివరణ ఇవ్వడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఇంతకీ, వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని నిజంగానే తీస్తాడా.? లేదంటే, సోషల్ మీడియాలోనే సినిమా మొత్తం చూపించేస్తాడా.? అన్న అనుమానాలు కలగకమానవు.
నిజమే మరి, క్రియేటివ్ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ తన క్రియేటివిటీనంతటినీ సోషల్ మీడియాకే పరిమితం చేసూఏస్తున్నాడు. ‘వంగవీటి’ సినిమా ఏమయ్యిందో చూశాం. ఈ మధ్య కాలంలో వర్మ తీసిన చాలా సినిమాలు చూస్తూనే వున్నాం. వెండితెరపై సినిమా మీద ఫోకస్ తగ్గి, సోషల్ మీడియాలో సినిమా మీద ఇంట్రెస్ట్ ఎక్కువవడంతోనే వస్తోంది అసలు సమస్య.
సినీ దర్శకుడిలా కాకుండా, ఓ పొలిటికల్ లీడర్ తరహాలో, తన మీద వస్తున్న విమర్శలకు ’మాటకు మాట‘ తరహాలో సోషల్ మీడియా వేదికగా వర్మ కౌంటర్ ఇస్తున్న తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది మరి.
Recent Random Post:
 
             
		
















