చినరాజప్పా.. మీ దగ్గరకొచ్చినోళ్ల కథేంటప్పా?

రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఏపీ టీడీపీ నేతలు నోరు విప్పుతున్నారు. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలతో ఏపీ టీడీపీని డిఫెన్స్ లోకి పడేశాడు. కేసీఆర్ తో ఏపీ నేతలు కుమ్మక్కు అయ్యారు, వందల వేల కోట్ల రూపాయల వ్యాపారాలు కేసీఆర్ దయతో చేసుకుంటున్నారు.. వీళ్లు కేసీఆర్ పై ఈగను వాలనిచ్చే పరిస్థితి లేదు అని రేవంత్ రెడ్డి కుండబద్ధలు కొట్టాడు. ఈ వ్యవహారం ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ అఫిషియల్ గా స్పందించలేదు.

కానీ పయ్యావుల, చినరాజప్ప వంటి వాళ్లు స్పందించారు. వీరిలో పయ్యావుల సగటు తెలుగుదేశం లీడర్ లానే మాట్లాడాడు. రేవంత్ వెనుక జగన్ ఉన్నాడు అనేశాడు. తమ విషయంలో ఏం జరిగినా.. అందులో జగన్ హస్తం అనడం టీడీపీకి కొత్తేమీ కాదుగా. ఇప్పుడు రేవంత్ వెనుక కూడా జగనే ఉన్నాడని పయ్యావుల తేల్చి చెప్పాడు. సో.. టీడీపీ వాళ్లు ఇక అలా ముందుకు వెళ్లవచ్చు.

ఇక ఈ అంశంపై మరో సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందన మాత్రం భలే ఉందిలే. రేవంత్ ఆరోపణలపై స్పందించమంటే.. ‘మామూలే పార్టీ మారే వాళ్లు ఇలా బురద చల్లిపోతూ ఉంటారు..’ అని వేదాంతం చెప్పాడీయన. భలే ఉంది కదా ఈ తాత్వికత. తమ వరకూ వచ్చే సరికి టీడీపీకి ఈ తాత్వికత బయటకు వస్తోంది.

కానీ.. మొన్నామన్న జగన్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చేరిన వారి కథేంటి? వాళ్లు చల్లిన దాన్ని ఏమనాలి? తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వచ్చి చేరారు అంటే.. ఫిరాయింపుదారులు కావొచ్చు, ఆ అంశంపై మాట్లాడిన టీడీపీ నేతలు కావొచ్చు.. ఎన్ని మాటలు అన్నారు? జగన్ వైఖరి సరికాదని, జగన్ డెవలప్ మెంట్ కు అడ్డుపడుతున్నాడని, జగన్ అలా అని, ఇలా అని.. తోచినట్టుగా మాట్లాడారు. ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డి, అఖిలప్రియ, అమరనాథ్ రెడ్డిలు అయితే నోటికి హద్దూ అదుపులేకుండా మాట్లాడారు.

తాము రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పుకోవడానికి వీళ్లు జగన్ పై పేట్రేగిపోయారు. దాన్ని తెలుగుదేశం అందంగా సమర్థిస్తుంది ఇప్పుడు కూడా. అయితే ఇప్పుడు రేవంత్ రూపంలో తమ వరకూ వచ్చే సరికి.. బురద జల్లడం అవుతోంది. ఇప్పుడు రేవంత్ జల్లుతున్నది బురద అయితే… అయితే వైసీపీ నుంచి ఫిరాయించిన వాళ్లు జల్లిందీ అదే కదా. తెలుగుదేశం ప్రలోభాలకు పడిపోయి వారు పార్టీ మారి, అధికారం కోసం ఫిరాయించినట్లే కదా.. దీన్ని ఒప్పుకునే ధైర్యం టీడీపీకి ఉందా? లేక రేవంత్ ఆరోపణలు అన్నీ నిజమే అని ఒప్పుకుంటారా? చాయిస్ టీడీపీకే!


Recent Random Post: