
ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాల్సిందే.. హాజరయి తీరాల్సిందే.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆ విషయమై కాస్సేపట్లో వైఎస్ జగన్ స్పష్టతనివ్వనున్నారు. ‘అసెంబ్లీలో మాట్లాడేందుకు తగిన సమయం దొరకడంలేదు.. అధికారపక్షం ఎదురుదాడితోనే సరిపెట్టేస్తోంది.. అధికారపక్షం చెప్పినట్లుగా స్పీకర్ వ్యవహరిస్తున్నారు.. మా హక్కుల్ని కాలరాస్తున్నారు.. ఇంకెందుకు అసెంబ్లీకి వెళ్ళాలి.?’ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, అధినేత జగన్ దగ్గర తమ గోడు వెల్లగక్కుకున్నారు.
ఎటూ జగన్ పాదయాత్రలో బిజీగా వుంటారు గనుక, ఆయన అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం లేదు గనుక, తాము కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టేయాలని, జనంలోకి వెళ్ళాలనీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలూ భావిస్తున్నా, అదేమంత సమంజసంగా అన్పించడంలేదు. పైపెచ్చు, జగన్ సైతం అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాల్సిందేనన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు సైతం, అసెంబ్లీకి వైఎస్సార్సీపీ గైర్హాజరీని సమర్థించడంలేదు.
ప్రతి శుక్రవారం న్యాయస్థానం యెదుట హాజరయ్యేందుకు వైఎస్ జగన్, పాదయాత్రకు విరామం ఇవ్వక తప్పదు. కాబట్టి, పాదయాత్రకు విరామం ‘కేసుల విచారణ కోసం’ ఇచ్చినట్లే, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకూ పాదయాత్రకు విరామం ఇవ్వడమే మంచిదన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షం సభకు హాజరు కాకపోతే, అధికారపక్షం అక్కడ ఏం మాట్లాడితే అదే ‘నిజం’.! అవును, అక్కడ రికార్డ్ అయ్యిందే ఫైనల్. కాబట్టి, ఆ ఛాన్స్ అధికారపక్షానికి ఇవ్వకూడదన్నది మెజార్టీ అభిప్రాయం.
కాస్సేపట్లో వైఎస్సార్సీపీ ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు వైఎస్ జగన్. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో మరో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీకి హాజరయ్యే విషయమై వైఎస్ జగన్ స్పష్టతనివ్వనున్నారు. ఈ నెలాఖరున పాదయాత్ర ప్రారంభం కావాల్సి వుండగా, దాన్ని నవంబర్ 2కి పోస్ట్‌పోన్ చేసి, ఆ తర్వాత మళ్ళీ నవంబర్ 6వ తేదీకి పాదయాత్రను మార్చిన దరిమిలా, అసెంబ్లీ సమావేశాల కోసం ఇంకోసారి పాదయాత్రను పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చినా తప్పు లేదన్నది నిర్వివాదాంశం.
మరి, జగన్ ఆ దిశగా ఆలోచన చేస్తారా.? పాదయాత్ర మళ్ళీ వాయిదా పడ్తుందా.? లేదంటే, నవంబర్ 6వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించి, కోర్టు విచారణ కోసం – అసెంబ్లీ సమావేశాల కోసం వైఎస్ జగన్ పాదయాత్రకు ‘విరామాలు’ ఇస్తారా.? వేచి చూడాల్సిందే.
Recent Random Post: