‘అమరావతి ఓపెనింగ్‌’ ఎప్పుడు జక్కన్నా.?

మాహిష్మతి రాజ్యాన్ని ఎలా నిర్మించాలో, దాన్ని ఇంకెంత అద్భుతంగా చూపించాలో ‘జక్కన్న’ రాజమౌళికి బాగా తెలుసు కాబట్టే, ‘బాహుబలి’ సినిమా అంత గొప్ప విజువల్‌ వండర్‌గా నిలిచింది. సరిగ్గా ఇక్కడే జక్కన్న, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి బాగా నచ్చేశాడు. అంతే, ‘అమరావతి డిజైన్లకు నువ్వే డైరెక్టర్‌’ అనేశారు చంద్రబాబు.

విజయేంద్రప్రసాద్‌ కథని సినిమాగా తెరకెక్కించినట్లుగా, చంద్రబాబు విజన్‌ని జక్కన్న అమ్మరావతి కోసం నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ ముందుంచారు. గతంలో నార్మన్‌ ఫోస్టర్స్‌ ఇచ్చిన డిజైన్లు అందగా నచ్చలేదుగానీ, జక్కన్న ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాక మాత్రం, చంద్రబాబుకి ఆ డిజైన్లు భలేగా నచ్చేశాయట. ఇది ఇప్పటికి అందుతున్న సమాచారం. అలాగని, పూర్తిగా చంద్రబాబుకి ఆ డిజైన్లు నచ్చేయలేదండోయ్‌. ఎందుకంటే, ఆయన నిప్పు నారా చంద్రబాబునాయుడు కదా.!

‘డిజైన్లు ఈసారి చాలా బాగున్నాయ్‌.. అయితే చిన్న చిన్న మార్పులు చేయాల్సి వుంది..’ అంటూ కొన్ని మార్పులు చేర్పులు చంద్రబాబు సూచించారట. మరి, అవన్నీ ఇప్పట్లో ‘క్లియర్‌’ అయిపోతాయా.? ఫైనల్‌ ఔట్‌పుట్‌ ఎప్పుడొస్తుందన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. రాజమౌళి, చంద్రబాబుతో కలిసి తాజాగా నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిథులతో నిన్న భేటీ అయిన విషయం విదితమే. అంతకుముందు రాజమౌళి, సీఆర్డీఏ ప్రతినిథులతో కలిసి లండన్‌లోనే నార్మన్‌ ఫోస్టర్స్‌ ప్రతినిథులతో భేటీ అయి, పలు మార్పులు చేర్పులు చేశారు. వాటినే నిన్న చంద్రబాబు తిలకించింది.!

సో, రాజధాని అమరావతికి సంబంధించి ‘జక్కన్న’ విజన్‌ కొంతమేర వర్కవుట్‌ అయినట్లేనన్నమాట. ఇది నిజానికి జక్కన్న విజన్‌ కాదు, చంద్రబాబుదట.. చంద్రబాబు విజన్‌ని రాజమౌళి ఎగ్జిక్యూట్‌ చేశారంతేనట. ఇది టీడీపీ నేతలు చెబుతున్నమాట. ఏదో ఒకటి, డిజైన్లు ఖరారైతే.. ఆ తర్వాత రాజధాని పనులు మొదలైతే అంతకన్నా కావాల్సిందేముంది.?

అంతా బాగానే వుందిగానీ, అమరావతి నిర్మాణాల ప్రారంభమెప్పుడట.? జక్కన్నా నీకైనా తెలుసా.? ప్చ్‌, అంత సీన్‌ జక్కన్నకి చంద్రబాబు ఇవ్వరుగాక ఇవ్వరు. ప్రధాని నరేంద్రమోడీతో శంకుస్థాపన చేయించడానికన్నా ముందే చంద్రబాబు, శంకుస్థాపన చేసేశారాయె. అదీ చంద్రబాబు ట్రాక్‌ రికార్డ్‌.


Recent Random Post: