
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు.. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఇప్పుడు ఓ ‘ఆట వస్తువు’గా మారిపోయింది. ‘నాన్నకు ప్రేమతో..’ అన్నట్లుగా స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించేందుకు ముందుకొచ్చారు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ. తేజ దర్శకత్వంలో, బాలకృష్ణ హీరోగా స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది.
ఇక, సంచలనాల రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ తనకు తోచిన ‘ఆట’ షురూ చేసేశారు. ‘తనక్కావాల్సిన అంశం’ వెతుక్కుంటూ వెతుక్కుంటూ చివరికి ఎన్టీఆర్ జీవితంలో ఓ పర్వాన్ని ఎంచుకున్నారాయన. అందులో ఆయన కోరుకునే ‘వివాదం’ చాలా వుంటుంది గనుక, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకి ఫిక్సయ్యారు వర్మ. ఈ సినిమా పేరుతో వర్మ చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు.
తాజాగా ఇప్పుడు మరో సినీ ప్రముఖుడు ‘ఎన్టీఆర్‌పై ప్రేమతో’ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఆయనే కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి. ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ అన్నది ఆయనగారి టైటిల్. ఇది కూడా బహుశా వర్మ ఎంచుకున్న ‘పర్వం’ చుట్టూనే సాగుతుందేమో.! విశేషమేంటంటే, వర్మ – తేజ రూపొందించే సినిమాలు 2018లో సెట్స్ మీదకు వెళ్తాయి. కానీ కేతిరెడ్డివారి ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ మాత్రం 2018 జనవరిలోనే విడుదలైపోతుందట. నవంబర్లోనే సినిమా ప్రారంభమవుతుందట.
ఎవరి గోల వారిది.. అనుకోవడానికి వీల్లేదిక్కడ. తెలుగు రాజకీయాలపై స్వర్గీయ ఎన్టీఆర్ ‘ఇంపాక్ట్’ అంతా ఇంతా కాదు. తెలుగు సినీ పరిశ్రమపై ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. తెలుగు సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆర్ పేరే. ఆ పేరుని ఎవరు చెడగొడతారు.? ఎవరు ఇంకా గొప్పగా చూపిస్తారు.? అన్నది పక్కన పెడితే, ఎన్టీఆర్ జీవితంతో ఎవరికి తోచిన ఆట వారు షురూ చేశారనే అనుకోవాలి. ఇప్పటికి ముగ్గురు.. ముందు ముందు ఈ సంఖ్య ఎంతకు పెరుగుతుందో.!
‘వద్దు బాబోయ్ నా జీవిత చరిత్ర..’ అని స్వర్గీయ ఎన్టీఆర్ ఎవరికీ చెప్పలేరు. ఎందుకంటే ఆయన ఇప్పుడు జీవించి లేరు గనుక. ‘ఇది తప్పు..’ అని కూడా ఆయన చెప్పలేని దుస్థితి. ఎవరికి తోచింది వారు తీసేయడమే. ఇది సినిమా ఆట.. ఇది ఎన్టీఆర్ జీవిత చరిత్రతో సినీ జనం ఆడుతున్న ఆట మరి.!
Recent Random Post: