ఇప్పటికే వచ్చేసింది… ఇంకా పాకులాటా?

గోరంతలు కొండంతలు చేయడం, గోటితో పోయేదానికి గొడ్డలి ఉపయోగించడం… సామెతలు తెలిసినవే. కొందరు వీటిని ఫాలో అవుతుంటారు. పనికిమాలిన వివాదాలను పట్టుకొని సా…గదీసుకుంటూ తద్వారా పాపులారిటీ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మంచి పనులు చేయడం ద్వారానో, సేవా కార్యక్రమాలు నిర్వహించడంవల్లనో పాపులారిటీ పెరగాలిగాని పనిగట్టుకొని దానికోసం వెంపర్లాడకూడదు.

అందుకోసం లేనిపోని రాజకీయాలు నడుపుతూ, ద్వేషాలు రెచ్చగొట్టకూడదు. ప్రస్తుతం ఇలా చేస్తున్న వ్యక్తి ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య. ఆయన గొడవ ఇంకా సద్దుమనగలేదు. విజయవాడలో సభ పెడతానంటూ యాగీ చేస్తున్నారు. అణగారిన సామాజికవర్గానికి చెందిన ఐలయ్య ప్రొఫెసర్‌గా ఎదిగి గౌరవం పొందారు. పాలకుల ప్రజావ్యతిరేక చర్యలు నిరసిస్తూ అందుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదంతా మెచ్చుకోదగిందే.

కాని అగ్రవర్ణాల మీద ఆయనకు ఎందుకో ద్వేషం. ఇందుకు కారణం ఆయన జీవితంలో వారి వల్ల ఎదురైన చేదు అనుభవాలు కావొచ్చు. వాటిని అధిగమించి కష్టపడి ఎదిగిన తరువాత ద్వేషాన్ని సజీవంగా ఉంచుకోవడంలో అర్థం లేదు. అగ్రవర్ణాలపై వ్యతిరేకతతో చేసిన వ్యాఖ్యలు, రాసిన పుస్తకాల కారణంగా బోలెడంత పాపులారిటీ వచ్చింది. మీడియా బాగా ఫోకస్‌ చేసింది. అయినప్పటికీ ఇంకా పాపులారిటీ పెంచుకోవాలనే తాపతయ్రం ఉన్నట్లుంది. వివాదాస్పద విషయాలపై టీవీ ఛానెళ్లలో చర్చా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఐలయ్య హాజరు తప్పనిసరి. ఆయన దళిత నేపథ్యం కారణంగా కమ్యూనిస్టు పార్టీలు, కొన్ని ప్రజాసంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలను, పుస్తకాలను సమర్థిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం సంచలనం, వివాదాస్పదమైంది. సామాజికవర్గాల మధ్య ద్వేషాలను రెచ్చగొడుతున్న ఈ పనికిమాలిన ఎపిసోడ్‌ను ముగించాల్సిన ఐలయ్య, మనోభావాలు దెబ్బతిన్న వర్గాలవారు సాగదీస్తున్నారు. ఐలయ్య మీదగాని, ఆయన్ని దుర్భాషలాడిన అగ్రవర్ణాల నాయకుల మీదగాని రెండు రాష్ట్రాల పాలకులు చర్యలు తీసుకోలేరు. ఏం చేసినా గొడవలైపోతాయి. అందులోనూ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రెండు వర్గాలే అవగాహనకు వచ్చి వివాదానికి స్వస్తి పలకాలి. ఐలయ్య విజయవాడలో సభ పెట్టి ఏం చెబుతారు? చెప్పాల్సిందంతా చెప్పేశారు. ఈయన సభ పెడతాననగానే తాము అదే రోజు సభ పెడతామని, అనుమతి ఇవ్వాలని ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలు పోలీసు శాఖను కోరాయి.

ఈ లేనిపోని తలనొప్పి ఎందుకని పోలీసు అధికారులు ఇద్దరికీ అనుమతి నిరాకరించారు. ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు నిరాకరిస్తున్నారంటూ ఐలయ్య వర్గీయులు గొడవ చేస్తున్నారు. అనుమతి ఇవ్వకున్నా సభ నిర్వహిస్తామని, అడ్డుకోవాలని చూస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. అగ్రవర్ణాలవారివల్ల ప్రాణహాని ఉందన్నారు ఐలయ్య. ప్రధానంగా టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ పేరూ చెప్పారు. ఐలయ్య పుస్తకాన్ని నిషేధించడం సమంజసం కాదని, ఆయనకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని సుప్రీం కోర్టు చెప్పడంతో ఆయనకు మరింత రెచ్చిపోయే అవకాశం దొరికింది.

తనకేదైనా జరిగితే అది మానవహక్కులకు విఘాతం కలిగినట్లేనని అన్నారు. ఇంగ్లిషును, విదేశీ సంస్కృతీ సంప్రదాయాలను అభిమానించే ఈ ప్రొఫెసర్‌ ఈమధ్య ఇక్కడ (తెలుగు రాష్ట్రాల్లో) తనకు ప్రాణహాని ఉందని అమెరికాకు తెలియచేస్తే అక్కడి ప్రభుత్వం సొంత ఖర్చుతో తనకు పూర్తి రక్షణ కల్పించి, ఆశ్రయం ఇస్తుందని చెప్పారు. ఇంతకంటే శుభవార్త ఏముంటుంది? అమెరికా రక్షణ కల్పించి ఆశ్రయం ఇచ్చినట్లయితే ఐలయ్య హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. విజయవాడ బదులు అమెరికా వెళ్లడం మంచిది కదా.


Recent Random Post: