రాజకీయం – బూతు పురాణం

వీధి రౌడీలని అనుకుంటున్నారా.? ఆ డౌట్‌ మీకొస్తే, అది మీ తప్పు కానే కాదు. అసెంబ్లీ కావొచ్చు, ఇంకెక్కడన్నా కావొచ్చు. నిస్సిగ్గుగా వ్యవహరించడమే రాజకీయమనుకుంటున్నారు ఈ తరం రాజకీయ నాయకులు. కొత్త తరం రాజకీయాల్లో, సీనియర్లు కూడా కొత్త కొత్త పాఠాలు నేర్చుకోవాల్సి వస్తోంది. అవే, బూతు పాఠాలు కావడం గమనార్హం. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్‌.. రాజకీయ నాయకుడంటే ‘వీధి రౌడీకన్నా దారుణం’ అన్న మాట రోజురోజుకీ బలపడ్తోంది.

ఉదాహరణ కావాలంటే, ఇదిగో ఈ ఉదంతంలోకి తొంగి చూడండి. ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత. పైగా, ఒకప్పుడు ఎంపీగా పనిచేసిన ఘనుడు. ఆయనే నామా నాగేశ్వరరావు. ఓ మహిళతో ఆయనగారు మాట్లాడిన బూతు పురాణం ఇప్పుడు వెలుగు చూసింది. తనను అంత దారుణంగా దూషించిన నామా నాగేశ్వరరావుపై ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ బూతు పురాణం వెనుక అక్రమ సంబంధాల వ్యవహారం కూడా దాగి వుందట. బాధిత మహిళ ఈ విషయాల్ని వెల్లడించేసరికి ఒక్కసారిగా అంతా షాక్‌కి గురవ్వాల్సి వచ్చింది. నామా నాగేశ్వరరావు వ్యవహారంపై గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకి బాధిత మహిళ ఫిర్యాదు చేశారట. చంద్రబాబుగానీ, టీడీపీలో ఇతర నేతలుగానీ తన ఫిర్యాదుపై స్పందించలేదని వాపోతున్నారామె.

ఆడియో టేపుల్లో నామా నాగేశ్వరరావు బూతు పురాణం వింటే, అసలు వీళ్ళు రాజకీయ నాయకులా.? అన్న అనుమానమొస్తోంది. రాజకీయ నాయకులే.. కానీ, తరం మారింది.. బూతు పురాణంలో కొత్త రాజకీయమన్నమాట.


Recent Random Post: