దివ్యదర్శనం భక్తులకు లెట్రిన్లు చూపించండి!

చంద్రబాబునాయుడు కొన్ని చిత్రమైన నిర్ణయాలు చేస్తుంటారు. అలాంటిదే ఒక సూచన శుక్రవారం నాడు అధికార్ల సమావేశంలో ఆయన నోటినుంచి వచ్చేసరికి నివ్వెరపోవడం అధికార్ల వంతయింది. ఇంతకూ సదరు అమూల్యమైన సూచన ఏంటో తెలుసా? పేద భక్తులను పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వ ఖర్చుతో తీసుకువెళ్లే దివ్యదర్శనం పథకం కింద తీసుకువెళ్లే వారికి, ఆయా ప్రాంతాల్లో సక్సెస్ ఫుల్ గా చేపట్టిన మరుగుదొడ్ల పథకాలను కూడా చూపించాలని, పరిశుభ్రత విషయంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందో వారికి అవగాహన కలిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారుట.

తద్వారా స్వచ్ఛాంధ్ర సాధనకు బాటలు వేయాలని చెప్పారుట. దివ్యదర్శనం పథకంలో భాగంగా శుభమా అని.. దేవుళ్లను చూడడానికి నిరుపేదలు వస్తోంటే.. వారికి ఈ మరుగుదొడ్ల టూర్ ఏర్పాటు చేసే ఖర్మ ఏంటోనంటూ అధికార్లు తలలు పట్టుకున్నారుట.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇటీవలి కాలంలో దివ్యదర్శనం అనే పథకాన్ని ప్రారంభించింది. ముస్లింలకు హజ్ యాత్రకు ప్రభుత్వమే ఖర్చులు భరించినట్లుగా.. రాష్ట్రంలోని నిరుపేద వర్గాలకు చెందిన వృద్ధ భక్తులకు పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వ ఖర్చులతోనే తీసుకువెళ్లి, దర్శనాలు చేయిస్తారు. ఒక రకంగా ఇది మంచి పథకమే. అందుకు ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.

అయితే ఆచరణలోకి వచ్చేసరికి చంద్రబాబునాయుడుకు దివ్యదర్శనానికి ముడిపెట్టడానికి అనేక అనుబంధ ఐడియాలు కూడా పుట్టుకొస్తున్నాయి. అలాంటిదే ఇప్పుడు ఆయన అధికార్లకు ప్రతిపాదించిన చిత్రమైన ఆలోచన. స్వచ్ఛాంధ్రప్రదేశ్ రూపకల్పన దిశగా ప్రభుత్వం చాలా సీరియస్ గానే చర్యలు చేపడుతున్నదని చెప్పాలి. విద్యార్థులందరినీ స్వచ్ఛత పనుల్లో భాగస్వాముల్ని చేయడం వంటివి ఇలాంటివే.

ఇప్పుడు ఆయన దివ్యదర్శనం భక్తులకు కూడా స్వచ్ఛత గురించి తమ ప్రభుత్వం చేస్తున్న కృషి తెలియజెప్పాలని అనిపించింది. దైవదర్శనాలకు వెళ్లే భక్తులకు పరిసర గ్రామాల్లో తాము కట్టించిన వ్యక్తిగత మరుగుదొడ్లను కూడా చూపించాలని అధికార్లకు పురమాయించారుట. పాపం వృద్ధులు ఏదో దేవుణ్ని చూడడానికి వస్తోంటే.. ఇలా.. లెట్రిన్లు చూపించి తీసుకువెళ్తే ఎలా అని అధికారులే , ముఖ్యమంత్రివర్యులకు ఎదురుచెప్పలేక తమలోతాము మల్లగుల్లాలు పడుతున్నారుట.


Recent Random Post: