
దేశంలో ఇదో పెద్ద ప్రశ్న అయి కూర్చుంది. దేశభక్తిని ఎలా చాటుకోవాలన్నదానిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. నిజానికి ఇది చర్చ కాదు, రచ్చ. చర్చ ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నది పాత మాట. చర్చ జరిగే కొద్దీ విషయం జఠిలమవుతుందన్నది నేటి మాట. అవును, దేశభక్తి విషయమై ఈ కొత్త చర్చ ఏంటి.? దేశభక్తి అంటే దేశభక్తి మాత్రమే.!
దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడం దేశభక్తి.. దేశ జెండా కన్పిస్తే, దానికి సెల్యూట్ చేయడం కూడా దేశభక్తే. జాతీయ గీతాన్ని గౌరవించడం కూడా దేశభక్తి కిందకే వస్తుంది. అవినీతికి పాల్పడకపోవడం దేశభక్తి. రాజకీయాల్లో అనైతిక చర్చలకు దిగకపోవడం దేశభక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే, దేశభక్తి అన్నిట్లోనూ చూపించాల్సి వుంటుంది. కానీ, చూపిస్తున్నామా.? లేదు. కానీ, దేశభక్తి కోసం చర్చించుకుంటున్నాం.
తనను గౌరవించమని ఏ దేశమూ చెప్పదు. తనకు నమస్కారం చేయమని ఏ దేవుడూ చెప్పడు. తనను కీర్తించమని ఏ మహానుభావుడూ కోరుకోడు. ఈ మట్టి మీద నిల్చున్నందుకు మనం నేలతల్లిని పూజిస్తాం. ఈ దేశంలో వుంటున్నందుకు గర్వపడ్తా, భరతమాతను తల్లిలా భావిస్తాం. మహానుభావులు తమ త్యాగాల ద్వారా గౌరవాన్ని పొందుతారు. వారిని గౌరవించడం ద్వారా మన గౌరవాన్ని మనం పెంచుకుంటాం. ఇదీ వాస్తవం.
పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయినవారు దేశభక్తి గురించి క్లాసులు తీసుకుంటున్నారు. పైగా, ఇలాగే దేశభక్తిని ప్రదర్శించాలంటూ మీడియాకెక్కి హడావిడి చేస్తున్నారు. సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఒకరేమో, ‘కొన్ని చోట్లకు తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళలేం.. ఎందుకంటే, వారికి అక్కడ గౌరవం దక్కదు గనుక. అలాగే, కొన్ని చోట్ల దేశభక్తి ప్రదర్శించలేం.. ఎందుకంటే దేశభక్తికి గౌరవం అక్కడ లభించదు గనుక..’ అంటాడు. దేశభక్తి అంత పలచనైపోయింది సదరు ప్రముఖుడికి.
దేవుడు దిగొచ్చినా నువ్వెవడు.? అని ప్రశ్నించే స్థాయికి మనం ఎదిగిపోయాం. అసలు దేశమంటే ఏంటి.? అని ప్రశ్నించే స్థాయికి మనం ఎదిగిపోయాం. దేశభక్తిని ఎక్కడ ప్రదర్శించాలో, ఎక్కడ ప్రదర్శించకూడదో, దానికి ఎక్కడ గౌరవం దక్కుతుందో కూడా మనమే డిసైడ్ చేసేస్తున్నాం. ఒక్కటి మాత్రం నిజం.. బలవంతాన భక్తి పుట్టదు. ఆ భక్తి పేరుతో జరగకూడని చర్చ జరుగుతున్నప్పుడు, దేశభక్తి గురించి అయినాసరే.. ఇది తప్పుడు చర్చ అని ఒప్పుకోక తప్పదు.
జాతీయ జెండా కన్పిస్తే గుండె ఉప్పొంగిపోవాలి.. జాతీయ గీతం విన్పిస్తే పరిసరాల్ని మైమర్చిపోయి దేశభక్తిలో మమేకమైపోవాలి.. అదీ దేశభక్తి అంటే. దేశభక్తి పేరుతో ఇప్పుడు జరుగుతున్న రాజకీయం హాస్యాస్పదం.. ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా వుంటుందా.? ఇది ఓట్ల రాజకీయం.. అవును, ఇది నిఖార్సయిన, దిక్కుమాలిన రాజకీయం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
Recent Random Post:

















