హీరోయిజం : ఎమ్మెల్యేగా కూడా రేవంత్ రాజీనామా!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి కూడా రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లుగా తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన కొన్ని గంటలకే ఆయన స్పీకరును ఉద్దేశించి రాసిన లేఖను కూడా ఆయనకు పంపేశారు. అచ్చమైన స్పీకరు ఫార్మాట్ లో వెంటనే ఆమోదం పొందే తీరులో… రేవంత్ తన పదవికి రాజీనామా చేశారు.

ఆ రకంగా.. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీకి రాజీనామా చేసినప్పుడు, వారి ద్వారా సంక్రమించిన పదవిని కూడా త్యజించాలనే మినిమం నైతిక విలువలను రేవంత్ రెడ్డి పాటించి, తన మార్కు హీరోయిజం ప్రదర్శించినట్లు అయింది. ఇటీవలి పరిణామాల్లో తెలుగు రాష్ట్రాల్లోని అనేక సంఘటనల్లో విపక్షాలనుంచి చాలా మంది ఎమ్మెల్యలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అధికార పార్టీల పంచన చేరినప్పటికీ.. ఏ ఒక్కరికీ పదవిని వదులుకునేంత ధైర్యం లేకుండా పోయింది. కానీ రేవంత్ మాత్రం.. తన పదవిని కూడా వదులుకోవడం విశేషంగా అందరూ భావిస్తున్నారు.

ఎమ్మెల్యేలు పార్టీలు మారడం గత మూడు సంవత్సరాలుగా తెలుగు ప్రజలు చూస్తూనే ఉన్నారు. అంతా ప్రతిపక్షంలో ఉన్న పార్టీల తరఫున గెలిచి.. ఆ పార్టీలను వదిలేసి.. అధికార పార్టీల తీర్థం పుచ్చుకున్న వారే.. అయితే పార్టీలను వదిలారే తప్ప పదవుల్ని వదిలే ధైర్యం ఎవ్వరికీ లేకపోయిందనే చెప్పాలి.

వారి వారి ప్రయోజనాల కోసం అధికార పార్టీల పంచన చేరారు.. మంత్రి పదవులను కూడా దండుకున్నారు గానీ.. నైతిక విలువలకు, రాజ్యాంగ నియమాలకు కట్టుబడి పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే దైర్యం మాత్రం వారిలో ఎవ్వరికీ లేకపోయింది. అయితే తెలంగాణలో కేసీఆర్ మీద అలుపెరగని పోరాటం సాగిస్తున్న రేవంత్ రెడ్డి ఒక రకంగా తొలినుంచి విభిన్నమైన బాటలోనే ఉన్నారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తెలుగుదేశాన్ని వీడినప్పటికీ, మరో విపక్షం కాంగ్రెసు వైపు అడుగులేశారే తప్ప.. అధికార పార్టీని పట్టించుకోలేదు.

అలా మారుతూ కూడా.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మరో రకంగా చెప్పాలంటే.. ఉప ఎన్నికలకు సవాలు విసిరారు. ఇప్పటికే పార్టీలు ఫిరాయించిన అనేక మందిమిగిలిన ఎమ్మెల్యేలు భుజాలు తడుముకునే పరిస్థితిని కల్పించారు. రేవంత్ రెడ్డి తాను అచ్చంగా స్పీకరు ఫార్మాట్ లో చేసిన రాజీనామాలేఖను మీడియాకు విడుదల చేశారు. రేవంత్ తెగింపునకు ఇది నిదర్శనంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిరాయింపుదార్లందరికీ ఇది చెంపపెట్టులా ఉంటుందని చెప్పాల్సిందే.


Recent Random Post: