ఎన్టీఆర్‌ ‘పుత్రరత్నాల’పై సినిమానా.?

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ – ఇది స్వర్గీయ ఎన్టీఆర్‌కి జరిగిన ‘వెన్నుపోటు’ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా. ఇందులో ప్రధానంగా మూడే ముఖ్యమైన పాత్రలు వుండొచ్చు. అది స్వర్గీయ ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్‌ అల్లుడు నారా చంద్రబాబునాయుడు. మిగతా పాత్రలు మరీ అంత ప్రాముఖ్యమైనవేమీ కాదన్న వాదన విన్పిస్తోంది ఈ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాకి సంబంధించి.

ఇక, రెండోది తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్‌’ సినిమా. ఇందులో ఎన్టీఆర్‌దే కీలక పాత్ర. ఆ పాత్రలో బాలకృష్ణ నటిస్తోన్న విషయం విదితమే. స్వర్గీయ ఎన్టీఆర్‌ సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా సాధించిన అద్భుత విజయాలే ఈ సినిమాలో కీలకమైన సన్నివేశాలు కానున్నాయి.

ముచ్చటగా మూడోది ‘లక్ష్మీస్‌ వీరగ్రంధం’. ఇది పూర్తిగా లక్ష్మీపార్వతి ఎవరు.? ఏంటి.? అన్న అంశాల నేపథ్యంలోనే తెరకెక్కుతోన్న సినిమా అట. ఆమెదే మెయిన్‌ క్యారెక్టర్‌ కావొచ్చునట. ఆ తర్వాతే ఎన్టీఆర్‌ పాత్ర అన్నది స్వయంగా దర్శకుడు, నిర్మాత చెబుతున్న విషయం.

మూడు మాత్రమే కాదు, ఇంకా ఇంకా రానున్నాయి ఎన్టీఆర్‌కి సంబంధించిన సినిమాలంటూ తాజాగా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానం చివరి రోజుల్లో, నందమూరి కుటుంబం ఎలా వ్యవహరించింది.? ప్రధానంగా ఎన్టీఆర్‌ పుత్రరత్నాలు ఎలా వ్యవహరించారు.? అన్న అంశాల చుట్టూ కథ తయారు చేసి, ఓ సినిమా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

దర్శకుడెవరు.? నిర్మాత ఎవరు.? వంటి విషయాలపై కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుందని తెలుస్తోంది. అదే గనుక నిజమైతే, ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర నేపథ్యంలో తెరక్కెనున్న నాలుగో సినిమా ఇదవుతుంది. మొత్తమ్మీద, తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్‌ తప్ప ఇంకో టాపిక్‌ లేదా.? అనేంతలా వరుసగా ఎన్టీఆర్‌ మీదనే సినిమాలు తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతుండడం విశేషమే మరి.


Recent Random Post: