ఎన్టీఆర్ బయోపిక్కే కాదు.. ఎంజీఆర్ వస్తున్నాడు!

ఒకవైపు తెలుగునాట ఎన్టీఆర్ విషయంలో రెండు సెటైరిక్ మూవీలు, ఒక బయోపిక్ వస్తున్నట్టుగా ఉన్నాయి. ఈ సంఖ్య ఇంతటితో ఆగుతుందా? లేక పెరుగుతూ పోతుందా? చూడాలి. ఎన్టీఆర్ విషయంలో ప్రతిపాదనలో ఉన్న మూడు సినిమాల్లో ఇంకా ఏదీ అధికారికంగా ఆరంభం కాలేదు. ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, ఎప్పటికి విడుదల అవుతాయో కూడా సందేహమే.

కోర్టుల్లో కేసులు, ఇతర, రచ్చలు చాలానే ఉండబోతున్నాయి ఈ సినిమాల విషయంలో. ఇదిలా ఉంటే.. తమిళనాట ఎంజీఆర్ బయోపిక్ తెరపైకి వచ్చింది. తమిళ అలనాటి సూపర్ స్టార్, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడి జీవిత కథ ఆధారంగా ఒక సినిమా తీయబోతున్నారట. ఎవరో అనామక ఫిల్మ్ మేకర్లే ఈ సినిమాను అనౌన్స్ చేశారు.

అయితే టైటిల్ రోల్ లో మాత్రం సత్యరాజ్ ను చూపబోతున్నారట. మరి సత్యరాజ్ ఎంజీఆర్ బయోపిక్ లో నటిస్తే దానికి కచ్చితంగా మంచి క్రేజే వచ్చే అవకాశం ఉంది. ఇది వరకూ పెరియార్ బయోపిక్ లో సత్యరాజ్ జీవించేశాడు. ఈ సినిమాకు ప్రస్తుతం అధికారంలో ఉన్న పళనిసామి ప్రభుత్వ అండదండలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

వచ్చే నెలలో ఈ సినిమా ఆరంభం అవుతుందని, పళనిసామే ఫస్ట్ క్లాప్ కొడతాడని అంటున్నారు. ఎంజీఆర్ ఇమేజ్ ను సొంతం చేసుకునే యత్నంలో ఉన్న పళనిసామి ఈ సినిమాను కూడా ఉపయోగించుకొంటూ ఉండవచ్చు.


Recent Random Post: