
ఎంతైనా దిల్ రాజు జడ్జిమెంట్ కు ఉన్న వాల్యూనే వేరు. ఓ కథకు ఆయన స్టాంప్ పడిందంటే.. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్లే. ఏదైనా సినిమాపై ఆయన కాన్ఫిడెంట్ గా కనిపించాడంటే ఆ సినిమా ఆడి తీరాల్సిందే. ‘శతమానం భవతి’ విషయంలో దిల్ రాజు కాన్ఫిడెన్స్ ఏంటో చాన్నాళ్ల నుంచి చూస్తున్నాం. రెండేళ్ల కిందటే ఈ ప్రాజెక్టును కన్ఫమ్ చేశాడు రాజు.
సాయిధరమ్.. రాజ్ తరుణ్ లాంటి హీరోలతో అనుకుని తర్వాత చివరికి శర్వాతో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు రాజు. సంక్రాంతికి చిరు.. బాలయ్యల మధ్య మహా సమరం జరగబోతున్నా సరే.. ఆ రెండు సినిమాల మధ్య ధైర్యంగా ‘శతమానం భవతి’ని రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డాడు. దాన్ని బట్టే ‘శతమానం భవతి’ మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటో అర్థమైంది.
రాజు నమ్మకాన్ని నిలబెడుతూ ‘శతమానం భవతి’ మంచి టాక్ తో పాటు మంచి వసూళ్లూ తెచ్చుకుంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల వరకే రూ.3 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా రూ.4 కోట్ల దాకా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది ‘శతమానం భవతి’.శర్వా స్థాయికి ఇది చాలా పెద్ద మొత్తమే. శనివారం రిలీజైన ఈ చిత్రం రెండో రోజైన ఆదివారం కూడా ఇదే స్థాయిలో వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. రెండో వీకెండ్లో సినిమాలేవీ లేవు కాబట్టి.. టాక్ బాగుంది కాబట్టి ఈ సినిమా ఫుల్ రన్లో పెద్ద మొత్తంలోనే వసూళ్లు రాబట్టే అవకాశముంది.
తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కాబట్టి అందరికీ మంచి లాభాలే వచ్చేలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 4 లక్షల మార్కుకు చేరువగా వచ్చింది. ఫుల్ రన్లో హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేయడం గ్యారెంటీ. ఇంత పోటీ మధ్య రిలీజై యుఎస్ లో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం చిన్న విషయం కాదు. మొత్తానికి చిన్న సినిమానే అయినా.. గట్టి పోటీ అయినా ‘శతమానం భవతి’ బాక్సాఫీస్ దగ్గర మెరుపులు మెరిపిస్తోంది.
Recent Random Post: