తప్పు ఒప్పేసుకున్న బాలయ్య

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లో ఎన్ని విశేషాలున్నా.. క్రిష్ ఎంత గొప్పగా ఈ సినిమాను తీసినా.. కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్పట్లేదు. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న ముఖ్యమైన కంప్లైంట్.. ఇందులో కథ అంటూ పెద్దగా ఏమీ లేదని. కేవలం యుద్ధాలతోనే మెజారిటీ సినిమాను లాగించేశాడని.. వేరే కథంటూ ఇందులో ఏమీ లేదని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. ఐతే ఈ విషయంలో హీరో బాలకృష్ణ బుకాయింపు మాటలేమీ మాట్లాడలేదు. నిజాయితీగా ఈ లోపాన్ని అంగీకరించాడు.

తమ సినిమాలో చెప్పుకోదగ్గ కథేమీ లేదన్నాడు బాలయ్య. ఐతే తమకు అందిన సమాచారం మేరకు శాతకర్ణి కథను గొప్పగా చెప్పడానికి ప్రయత్నం చేశామని బాలయ్య వ్యాఖ్యానించాడు. తమ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందనే వస్తోందని.. ఇలాంటి సినిమా ఇంకొకటి చేయమని తనను అందరూ అడుగుతున్నారని బాలయ్య చెప్పాడు. ఐతే ఈ స్థాయి సినిమా చేయాలంటే స్క్రిప్టు దొరకడం అంత సులువు కాదని బాలయ్య వ్యాఖ్యానించాడు.

ఓవైపు ‘ గౌతమీపుత్ర శాతకర్ణి’ లో కథే లేదని విమర్శలు వస్తుంటే.. ఈ కథంతా వక్రీకరణే అంటూ మరోవైపు వివాదం రాజుకుంటుండటం విశేషం. పాండురంగారెడ్డి అనే చరిత్రకారుడు ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. శాతకర్ణి కోటి లింగాల్లో పుట్టలేదని.. ఆయన తల్లి గౌతమి ఆనవాళ్లు మహారాష్ట్రలో ఉన్నాయని.. శాతకర్ణి కుమారుడు పులోమావి విధిలేని పరిస్థితుల్లో అమరావతికి వచ్చాడని ఆయన అన్నారు.

చరిత్రను వక్రీకరించి సినిమా తీసిన క్రిష్.. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ చిత్రానికి ఇచ్చిన పన్ను మినహాయింపును రద్దు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆయన డిమాండ్ చేశారు.


Recent Random Post: