
రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి అండ్ కో కాంగ్రెస్ పార్టీలో చేరే లాంఛనం పూర్తయింది. రేవంత్ తో పాటూ తెలుగుదేశానికి చెందిన నాయకులు మరికొందరు కూడా కాంగ్రెసులో చేరారు. వీరిలో ముందునుంచి ప్రచారంలో ఉన్న కొందరు, అనూహ్యంగా తెరపైకి వచ్చిన మరికొందరు నాయకులు ఉన్నారు. రాహుల్ గాంధీ సమక్షానికి వచ్చేప్పుడు కేవలం 12 -13మంది నేతలు మాత్రమే రావాలని.. అంతకంటె ఎక్కువ మంది వద్దని ముందే తెలియజేశారు. అయితే.. రేవంత్ కు లక్కీ నెంబర్ 9 కావడంతో.. దానికి మ్యాచ్ అయ్యేలా… మొత్తం 18మంది సమూహంగా వెళ్లి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
వీరిలో రేవంత్ రెడ్డితో పాటు సీతక్క, వేం నరేందర్ రెడ్డి, విజయ రమణరావు, అరికెల నర్సారెడ్డి, బోడ జనార్దన్, సోయం బాబురావు, పటేల్ రమేష్ రెడ్డి, దొమ్మటి సాంబయ్య, తోటకూర జానయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, హరిప్రియ నాయక్, బల్యనాయక్, రాజారాం యాదవ్ వీరితో పాటు మరో ముగ్గురు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ సభ్యులు కూడా ఉన్నారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరదలచుకున్న తరువాత.. రాహుల్ గాంధీకి తనతోపాటూ 30 మందికి పైగా తెలుగుదేశం నేతలు తరలివస్తారని వారందరికీ టికెట్లు ఇస్తే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారని ముందుగనే ఒక జాబితా ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఆయన తెలుగుదేశానికి రాజీనామా కూడా చేసేసిన తర్వాత.. తాజా పరిణామాల్లో… తెరాస నుంచి కూడా రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నాయకులు కూడా పార్టీని వీడి రేవంత్ కు మద్దతు ప్రకటించడం కూడా జరిగింది. అయితే తెలుగుదేశం నుంచి రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి చేరడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు ఇంకా పూర్తిగా బయటపడడం లేదని రాజకీయవర్గాల్లో ఒక ప్రచారం నడుస్తోంది.
రకరకాల కారణాలు, ప్రయోజనాల వల్ల మరికొంత కాలం తెదేపాలోనే కొనసాగే ఉద్దేశంతో కొందరున్నారుట. దానికి తగ్గట్లుగా హస్తినకు తక్కువ మంది అనుచరగణంతో రావాలని రాహుల్ ఆఫీసు నుంచి వర్తమానం రావడంతో.. ‘సింగిల్ 9’ నెంబరు కారు వాడే అలవాటు ఉన్న రేవంత్ రెడ్డి తన లక్కీనెంబర్ కు తగినట్లుగానే.. మొత్తం 18 మంది జట్టుగా వెళ్లడానికి అనుమతి తీసుకుని ఆమేరకు నాయకులను వెంట తీసుకువెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ మాటలు కార్యరూపం దాలిస్తే.. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ శక్తుల పునరేకీకరణకు ఇది శ్రీకారం అనుకోవాలి.
Recent Random Post:

















