తాప్సీకి మళ్ళీ కోపమొచ్చేసింది

పాపం తాప్సీకి ఈ మధ్య ఇంటర్వ్యూలు అస్సలేమాత్రం కలిసిరావడంలేదు. పైగా, ఆ ఇంటర్వ్యూలు తాప్సీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ‘స్ట్రెయిట్‌ ఫార్వార్డ్‌’ అంటూ, నోటికొచ్చింది మాట్లాడేస్తుంటుంది తాప్సీ. అదే ఆమెకు పెద్ద సమస్యగా మారిపోతుంటుంది. ఆ మధ్య దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై తాప్సీ నోరు పారేసుకోవడం, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం తెల్సిన విషయమే.

‘నాభి ప్రాంతంలో కొబ్బరికాయ పగలగొట్టడమట.. అందులో ఏం సెక్సప్పీల్‌ వుందో నాకైతే అర్థం కాలేదు..’ అంటూ తాప్సీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. అంతేనా, ‘సౌత్‌లో హీరోయిన్లని గ్లామర్‌ డాల్స్‌గా మాత్రమే చూస్తాను.. నా వరకూ నేను, అలా వుండాలనుకోను.. కానీ, నాతో అనవసరంగా దారుణమైన ఎక్స్‌పోజింగ్‌ చేయించారు..’ అని ఇంకోసారి సౌత్‌ సినిమాపై అసహనం వ్యక్తం చేసి, అడ్డంగా బుక్కయిపోయింది తాప్సీ.

మొన్నీమధ్యనే వచ్చిన ‘జుద్వా-2’ సినిమాలో తాప్సీ చేసింది ఏంటట.? ఈ ప్రశ్నకు తాప్సీ నోట సమాధానమే రాదు. మళ్ళీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌత్‌ సినిమాపై నోరు పారేసుకుంది. గ్లామర్‌ గురించీ, కెరీర్‌ గురించీ మాట్లాడుతూ, ‘సౌత్‌లో అన్నీ ఫ్లాపులే.. నాకు సౌత్‌ పెద్దగా కలిసి రాలేదు..’ అనేసింది. అయితే, ఆ ఇంటర్వ్యూలో తాను చెప్పిన మాటలు వక్రీకరించారంటూ ఖండన ప్రకటన కూడా తాప్సీ నుంచే రావడం గమనార్హం.

‘నేను ఏ మాట మాట్లాడినా దానికొక కాంటెక్స్‌ట్‌ వుంటుంది.. అది అర్థం చేసుకోకుండా సంచలనాలకోసం ఇంటర్వ్యూల్ని వక్రీకరించేస్తే ఎలా..’ అంటూ తాప్సీ అసహనం వ్యక్తం చేసింది. ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఎడా పెడా కామెంట్లు చేసేయడం, ‘కాంటెక్స్‌ట్‌’ గురించి మాట్లాడటం.. ఇదీ వరస.! మొన్నీమధ్యనే ‘ఆనందో బ్రహ్మ’ సినిమాతో తెలుగులో మంచి విజయాన్నే అందుకున్న తాప్సీకి సౌత్‌ అంటే ఎందుకు అంత అక్కసు.? ఏమో, ఆమెకే తెలియాలి.


Recent Random Post: