
‘అదిరింది’ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది.? ఈ ప్రశ్న మాత్రం వేయకూడదు. ఎందుకంటే, దానికి ఆ సినిమా నిర్మాత వద్ద సమాధానం లేదు. తేనాండల్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా తమిళంలో నిర్మించిన ‘మెర్సల్’ ఘనవిజయాన్ని అందుకుంది. విజయంతోపాటే బోల్డన్ని వివాదాలూ ఈ సినిమాని వెంటాడుతూనే వున్నాయి. ఆ వివాదాలు సినిమాకి అదనంగా పబ్లిసిటీ తెచ్చిపెడ్తున్నాయనుకోండి.. అది వేరే విషయం.
ఇక, ఈ సినిమా తెలుగులోనూ తమిళ వెర్షన్‌తో సమానంగా ‘అదిరింది’ పేరుతో విడుదల కావాల్సి వున్నా, ఇప్పటిదాకా విడుదల కాలేదు. ‘రేపే విడుదల’ అంటూ నానా హంగామా నడిచిన వేళ, మళ్ళీ అనూహ్యంగా ‘సినిమా విడుదల వాయిదా’ అనే ప్రకటనతో మరోమారు ఆ సినిమాని తెలుగులో చూద్దామనుకునేవారిలో నిరుత్సాహం నింపేశారు.
మామూలుగా అయితే విజయ్ సినిమాలకి తెలుగులో పెద్దగా మార్కెట్ వుండదు. విజయ్ సినిమాలు రీమేక్ అయి, తెలుగులో విజయవంతమవడం తప్ప, డైరెక్ట్‌గా తెలుగులోకి డబ్ అయిన విజయ్ సినిమాలేవీ విజయాలు అందుకోలేదు. ‘అదిరింది’ సినిమా మాత్రం, ఆ చెత్త రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందనే అంతా అనుకున్నారు. విడుదలకు ముందు సినిమాకి అన్నీ కలిసొచ్చి, తెలుగులోనూ మంచి హైప్ క్రియేట్ అయినా, సకాలంలో సినిమా విడుదల చేయలేకపోయారు.
ఈలోగా రీమేక్ గాసిప్స్ వచ్చాయి. ఆ గాసిప్స్నీ తాపీగా చిత్ర నిర్మాత ఖండించేశారు. ‘త్వరలో తెలుగులో విడుదలవుతుంది’ అంటూ మళ్ళీ పాత పాటే పాడేశారు. ఇంతకీ, తెలుగు సినిమా విడుదల కావడానికి అడ్డంకులు ఏంటట.? ఆ ఒక్క ప్రశ్నకీ సమాధానం మాత్రం చెప్పేందుకు తేనాండల్ సంస్థ సుముఖత వ్యక్తం చేయడంలేదు. సెన్సార్ ఇబ్బందులు.. అన్న మాట తెరపైకి రావడంతో, సెన్సార్ బోర్డ్ ఆ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించేసిన విషయం విదితమే.
అన్నీ వున్నా అల్లుడి నోట్లో డాష్ డాష్ అన్నట్టుగా, తమిళంలో ‘మెర్సల్’ సూపర్ హిట్టయ్యి, తెలుగులో ‘అదిరింది’పై మంచి హైప్ క్రియేట్ చేసినా, ప్చ్.. ‘అదిరింది’ విడుదల కావడంలేదాయె.! తెరవెనుకాల మతలబు ఏంటో తేనాండల్ సంస్థకే తెలియాలి.
Recent Random Post:

















