ఏపీలో పోటాపోటీ… టీఎస్‌లో టీఆర్‌ఎస్‌ టాప్‌..!

ఏపీలో రాజకీయంగా పోటాపోటీగా ఉన్న పార్టీలు టీడీపీ, వైకాపా అనే విషయం తెలిసిందే. తెలంగాణలో టాప్‌లో ఉన్నది అధికార పార్టీ అనేది చెప్పక్కర్లేదు. అందరికీ తెలిసిన సంగతి గురించి చెప్పుకునేదేముంది? అనుకోవచ్చు. కాని ఇది రాజకీయ కథ కాదు. ఎన్నికలకు సంబంధించిన విషయం కాదు. రెండు రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న వివిధ అంశాలకు సంబంధించిన ఆరోపణల కథ.

ప్రజాప్రతినిధులు పత్తిత్తులు కారు కాబట్టి వారిపై ఆరోపణలు ఉండటం సహజం. వారి వృత్తి రాజకీయం, కొందరికి నేరాలు చేయడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయడం ప్రవృత్తి. ఆరోపణలు ఉన్నవారిలో చాలామందిపై విచారణ జరగదు. జరిగినవారిలో చాలామందికి శిక్షలు పడవు. శిక్షలు పడినవారు కూడా ఏదోవిధంగా తప్పించుకొని మళ్లీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతుంటారు. వీళ్లనేం చేయాలి?

దీనికి సమాధానం కోసం వెదుకుతున్న సుప్రీం కోర్టుకు ఓ ఆలోచన వచ్చింది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి ఆరోపణలున్న ప్రజాప్రతినిధులను విచారించి, నేరం రుజువైతే వారిపై జీవితకాలం నిషేధం విధించాలనేది సర్వోన్నత న్యాయస్థానం ఆలోచన. దీనికి ఎన్నికల సంఘం మద్దతు పలికింది. జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలనే ఆలోచనను ఎన్నికల కమిషన్‌ స్వాగతించింది.

దీనికి సంబంధించి వచ్చే నెలలో ప్లాన్‌ తయారుచేసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2014ఎన్నికల్లో ఎన్నికైన అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల్లో (ఎమ్మెల్యేలు, ఎంపీలు) ఉన్న నేరగాళ్ల, ఆరోపణలున్నవారి జాబితాలు తయారుచేశారు. నిజంగా సుప్రీంకోర్టు ఆలోచన ఫలించి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి, నేరగాళ్లయిన ప్రజాప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లోగా శిక్షపడితే అంతకుమించిన అద్భుతమైన సంస్కరణ మరొకటి ఉండదనే చెప్పొచ్చు. కాని మోదీ సర్కారు ఎంతవరకు సహకరిస్తుందనేది చూడాలి.

నిజానికి ఇది కొత్త ఆలోచన కాదు. ప్రజాస్వామ్యంలో సంస్కరణలు కోరుకునేవారంతా ఇలాంటి ఆలోచనలు చేశారు. మోదీ అధికారంలోకి రాగానే చాలా గొప్పగా నేరారోపణలు ఉన్న ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ఉండకూడదన్నారు. అలాంటివారిపై విచారణ జరిపేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయించి ఏడాది శిక్షలు వేయిస్తామన్నారు. ఇలాంటి విషయాలు చెప్పినంత సులభం కాదు. రాజకీయంగా అనేక ఇబ్బందులుంటాయి. ఈ తత్వం బోధపడిన తరువాత మోదీ దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు సుప్రీం కోర్టు తెర మీదికి తెచ్చింది. ఇక దేశంలోని ఇతర రాష్ట్రాల సంగతి అలావుంచితే, తెలుగు రాష్ట్రాల్లో ఆరోపణలున్న ప్రజాప్రతినిధుల విషయం చూద్దాం.

నేరారోపణలున్న ప్రజాప్రతినిధులు ఏపీలోని టీడీపీలో, వైకాపాలో ఎక్కువగా ఉన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే పోటీపోటీగా ఉన్నారనుకోవచ్చు. సహజంగానే అధికార పార్టీలో ఎక్కువమంది ఉన్నారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో 61 మందిపై ఆరోపణలున్నాయి. వీరిలో టీడీపీవారు 35 మంది కాగా, వైకాపావారు 23 మంది. ఒక బీజేపీ ఎమ్మెల్యే, ఓ ఇండిపెండెంట్‌ ఉన్నారు. ఎంపీల్లో చెరో నలుగురున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఇద్దరున్నారు.

ఇక తెలంగాణలో సహజంగానే అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టాప్‌లో ఉన్నారు. మొత్తం 119ఎమ్మెల్యేల్లో 22మంది టీఆర్‌ఎస్‌వారు కాగా, కాంగ్రెసు, ఎంఐఎం నుంచి చెరో ఐదుగురున్నారు. బీజేపీ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి నలుగురున్నారు. టీడీపీ విషయంలో కొంత అయోమయం ఉంది. ప్రస్తుతం దానికి మిగిలింది ఇద్దరు ఎమ్మెల్యేలు. నలుగురిలో ఈ ఇద్దరున్నారా? లేదా అందరూ ఫిరాయింపుదారుల్లో ఉన్నారా? అనేది తెలియాల్సివుంది. ఎంపీల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం నుంచి ఒక్కొక్కరున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఒకరున్నారు. ఇదీ సంగతి. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి వీరిని విచారిస్తారా? ఆరోపణలు రుజువైతే జీవితకాలం నిషేధం విధిస్తారా?


Recent Random Post: