చంద్రబాబు కుతంత్రం: జగన్‌ బీ కేర్‌ఫుల్‌.!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రపై, పార్టీ శ్రేణులకు హెచ్చరికలు పంపారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. ‘జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు.. తుని లాంటి ఘటనలు జరగొచ్చు.. అప్రమత్తంగా వుండండి..’ అన్నది చంద్రబాబు హెచ్చరికల సారాంశం. మామూలుగా అయితే, ఈ హెచ్చరిక ఆయన ముఖ్యమంత్రి హోదాలో, పోలీసు యంత్రాంగానికి చేయాల్సి వుంటుంది. మరెందుకు, చంద్రబాబు – టీడీపీ శ్రేణులను హెచ్చరించారు.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళన బాట పట్టడం తెల్సిన విషయమే. నిజానికి, చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీ ఇది. దీన్ని నెరవేర్చమనే డిమాండ్‌ చేస్తున్నారు ముద్రగడ. ఆ డిమాండ్‌తోనే, ముద్రగడ కాపు ఐక్య గర్జన వేదిక పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. అక్కడే మొదలైంది అసలు రాజకీయం. సభ ముగిసింది, ఆ తర్వాత రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆ సభా ప్రాంగణానికి కొద్ది దూరంలోనే తగలబడింది. తుని నగరంలో ‘అసాంఘీక శక్తులు’ విధ్వంసం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధ్వంసమది.

వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోనే ఈ విధ్వంసానికి ప్లాన్‌ జరిగిందన్నది టీడీపీ ఆరోపణ. సాక్షాత్తూ పలువురు మంత్రులే వైఎస్సార్సీపీ మీద ఆరోపణలు చేశారు. కానీ, ఆ కేసులో ఇంతవరకు వైఎస్సార్సీపీపై ఆరోపణల్ని నిరూపించలేకపోయింది చంద్రబాబు సర్కార్‌. ఎలాగైతేనేం, తుని విధ్వంసం పేరుతో ముద్రగడ పద్మనాభం నోరు కొక్కేశారు.. ముద్రగడ పాదయాత్రకు పదే పదే అడ్డు తగులుతున్నారు. ఇదీ నిఖార్సయిన నికృష్ట రాజకీయమంటే.

ఇక, అసు విషయానికొస్తే జగన్‌ పాదయాత్ర మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జగన్‌ పాదయాత్రపై చంద్రబాబు, టీడీపీ శ్రేణులకు హెచ్చరికలు పంపడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. జగన్‌ పాదయాత్రకీ, తుని విధ్వంసానికీ చంద్రబాబు ముడిపెడుతున్నారంటే, తెరవెనుకాల ‘స్కెచ్‌’ ఎంత భయంకరంగా వుండబోతోందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

ఏదో ఒక గలాటా సృష్టించి, జగన్‌ పాదయాత్రకు అడ్డు తగలాలన్నది చంద్రబాబు స్కెచ్‌. ఆ గలాటా ‘తుని విధ్వంసానికి’ మించి వుండాలన్నది బహుశా, చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఇచ్చిన సంకేతమా.? ఈ అనుమానాలిప్పుడు వైఎస్సార్సీపీని వెంటాడుతున్నాయి. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, షర్మిల పాదయాత్రలు నిర్వహించారు.. చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. అప్పుడెప్పుడూ రాని ‘విధ్వంస’ అనుమానాల్ని ఇప్పుడే చంద్రబాబు ఎందుకు క్రియేట్‌ చేస్తున్నారు.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

సేమ్‌ టు సేమ్‌ ముద్రగడ విషయంలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడా అనుసరించాలన్నది చంద్రబాబు ఆలోచనగా కన్పిస్తోంది. అదే గనుక నిజమైతే, చరిత్రలో ఇంతకన్నా భయంకరమైన రాజకీయ వ్యూహం ఇంకొకటి వుండదు. కాబట్టి, పాదయాత్రకు పూనుకుంటున్న వైఎస్‌ జగన్‌, అధికార పార్టీ వ్యూహాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వుండాల్సిందే.!


Recent Random Post: