
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పగపడితే ఎలా ఉంటుందో ఆ రాష్ట్రంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులకు ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు నిన్నటిదాకా ఎన్నికల అధికారిగా పని చేసిన భన్వర్ లాల్ విషయంలో ఏపీ సర్కారు కొట్టిన దెబ్బ అందరికీ ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది. చంద్రబాబునాయుడు పగపడితే దాని రేంజ్ అలాగే ఉంటుందని, ఎన్నేళ్ళు గడిచిపోయినా ఆయన మాత్రం మరచిపోరని పలువురు అనుకుంటున్నారు.
భన్వర్ లాల్ అక్టోబర్ 31న పదవీ విరమణ చేశారు. ఈ సమయంలో ఆయనకు పాత కేసులకు సంబంధించిన క్రమశిక్షణ చర్యల నోటీసులు అందించింది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భన్వర్ లాల్ గతంలో కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఒక క్వార్టర్ లో ఉండేవారు. ఆ హోదా నుంచి మరొక హోదాకు మారిన తరువాత ఆయన క్వార్టర్ మాత్రం ఖాళీ చేయలేదు. దీనిపై క్రమశిక్షణ చర్యల కింద కేసు నమోదు అయింది. ఇదంతా చాలా సంవత్సరాల కిందటి మాట. ఆ తరువాత ఆయన సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ … ఇలా అన్ని హోదాలకు ప్రమోట్ అయ్యారు. ఆ తరువాత ఎన్నికల అధికారి కూడా అయ్యారు.
ఆ సమయంలో ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబునుడు పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చి.. తన వేలిపై ఇంకు గుర్తు చూపించి.. ఓటు వేసినట్లు మీడియాతో మాట్లాడుతూ.. తాను భాజపాకు ఓటు వేసినట్లు చెప్పారు. అయితే ఈ విషయం ఎన్నికల అధికారి వద్ద మీడియా ప్రస్తావించినప్పుడు.. అలా వెల్లడించడం నేరం అని, తాము కఠిన చర్యలు తీసుకోవచ్చునని, నిబంధనల ప్రకారం చంద్రబాబునాయుడు ఓటును కూడా రద్దు చేయవచ్చునని భన్వర్ లాల్ మీడియాకు చెప్పారు.
ఆయన నిబంధనల్ని చెప్పారే తప్ప చంద్రబాబు మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. అయితే.. ఆ విషయం టీవీ ఛానెళ్లలో విపరీతంగా ప్రచారం అయింది. ‘‘చంద్రబాబునాయుడు ఓటు హక్కు రద్దు’’ అంటూ అందరూ బ్రేకింగ్ న్యూస్ లు అందించారు. దీంతో చంద్రబాబు పరువు పోయింది.
రాష్ట్రం విడిపోయిన తర్వాత.. ఐఏఎస్ అధికార్ల పంపకంలో భాగంగా.. ఆయన ఏపీ కేడర్ కు చెందిన అధికారి అయ్యారు. అదే ఆయన పాలిట శాపంగా మారినట్లు కనిపిస్తోంది. క్వార్టర్ ఖాళీ చేయలేదనే పెండింగ్ కేసును తేల్చకుండా, ఆయనకు జరిమానా ఏమిటో ఖరారు చేయకుండా, ఆ సాకు చూపించి, ఆయన హోదాకు తగినట్లుగా మధ్యలో రావాల్సిన ప్రమోషన్లను కూడా ఆపేస్తూ ఏపీ ప్రభుత్వం ఆయన పట్ల ఇన్నాళ్లుగా వివక్ష ప్రదర్శించింది.
ప్రమోషన్లు ఎటూ ఆగిపోయినా, రిటైర్మెంటు విధిగా వచ్చేస్తుంది గనుక.. ఆయన అక్టోబరు 31న రిటైరయ్యారు. కాకపోతే ఈ సందర్భంలో పాత కేసును తిరగతోడి ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన కేసు పరిష్కరించుకునే వరకు రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా ఆగిపోతాయి. ఆయన ఎన్నడో కలెక్టరుగా పనిచేసిన తర్వాతి నాటి వ్యవహారాన్ని ఇన్నాళ్లు తేల్చకుండా నాన్చి… రిటైర్మెంటు రోజున ఇచ్చిన నోటీసులతో చంద్రబాబు నాయుడు పగ అంటే ఇలా ఉంటుందా అని అధికారులే నివ్వెరపోతున్నారు.
Recent Random Post:

















