
ఇటీవల వచ్చిన ఓ తెలుగు సినిమాలో హీరో అర్థం కాకుండా ఏదో డైలాగ్ చెప్పేస్తాడు. ఆ డైలాగ్ ఎలా వుందని, పక్కనే వున్న కమెడియన్ని అడిగితే, ‘వర్మ ట్వీట్లా వుంది’ అంటాడు. ‘అంటే, ఎవరికీ అర్థం కాలేదన్నమాట’ అని ఆశ్చర్యపోతాడు ఆ హీరో. మేధావులకు తప్ప, మామూలుగా ఎవరికీ వర్మ మాటలు అర్థం కావు. విమర్శించాలనుకుంటాడు, ఉద్దేశ్యం విమర్శే అయినా, అందులో పొగడ్త వుందని అందరూ అనుకోవాలని ఆలోచిస్తాడు. అది అసలు విషయం. అందుకే, వర్మ సోషల్ మీడియాలో చేసే పోస్టింగ్స్ అంత తేలిగ్గా అర్థం కావు.
తిడితే తిట్టెయ్యాలి.. పొగిడితే పొగిడెయ్యాలి.. కానీ, అలా చేస్తే ఆయన వర్మ ఎందుకవుతాడు. తన తికమక మాటల్తో, ఎవరికీ అర్థం కాని, అతి క్లిష్టమైన ఇంగ్లీషు పదాలతో వర్మ చేసే పదప్రయోగాలు ఆఖరికి, వర్మ కుమార్తెకి కూడా అర్థం కాలేదు. ఇంతకీ, ఏ విషయంలోనో తెలుసా.? ఇంకే విషయంలో, పవన్‌కళ్యాణ్ కుమారుడి పేరు విషయంలో.
పవన్ – అన్నా లెజ్నెవా దంపతులకు ఇటీవల ఓ కుమారుడు జన్మించిన విషయం విదితమే. మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరుని పవన్, తన కుమారుడికి పెట్టాడట. అది ఆయనిష్టం. కానీ, వర్మకి ఇక్కడే ఏదో ‘ఇంట్రెస్టింగ్ పాయింట్’ దొరికింది. అంతే, సోషల్ మీడియాలో తన ప్రావీణ్యమంతా ఉపయోగించి ఓ పోస్టింగ్ పెట్టాడు. దానికి ముందుగా ఆయనగారి కుమార్తె నుంచే కౌంటర్ పడింది. దానికి మళ్ళీ వర్మ వివరణ ఇచ్చాడనుకోండి.. అది వేరే విషయం.
నిన్నమొన్నటిదాకా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో సోషల్ మీడియాలో రచ్చ చేయడం, ఆ తర్వాత రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌ని పట్టుకుని హల్చల్ చేయడం.. ఇప్పుడు ఇదిగో, ఇలా పవన్‌కళ్యాణ్ కుమారుడి పేరుతో హడావిడి.! వర్మ రూటే సెపరేటు. జనం తనని మర్చిపోకూడదన్నది ఆయనగారి ఆలోచన. తన ప్రావీణ్యాన్ని ప్రపంచమంతా గుర్తించాలనే తపన.! ప్రపంచం సంగతి తర్వాత, ఆయనగారి కూతురికే వర్మ తపన అర్థం కావడంలేదు. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకుంటున్నాడంటే, పైన సినిమాలో వర్మ మీద హీరో – కమెడియన్ మధ్య ‘డైలాగ్’ నిజమేనని ఒప్పుకోకుండా వుండగలమా.?
Recent Random Post:

















