యనమల సారూ.. నువ్వూ ఏసేశావ్‌.!

మొన్న పనామా పేపర్స్‌.. ఇప్పుడేమో ప్యారడైజ్‌ పేపర్స్‌.. ఈ ‘పేపర్స్‌’ వెలుగులోకి తెచ్చిన అంశాలతో ప్రపంచ దేశాల్లో ‘ప్రకంపనలు’ రేగుతున్నాయి. పాకిస్తాన్‌ అధ్యక్షుడి పదవినే ఊడగొట్టింది ఈ పేపర్స్‌ వ్యవహారం. చాలా దేశాల్లో ఈ పేపర్స్‌ తాలూకు రచ్చ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇండియాలో మాత్రం, ఈ పేపర్స్‌ వ్యవహారం పెద్ద కామెడీ. ఎందుకు.? అంటే, అదంతే.!

తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు పనామా పేపర్స్‌లో వెల్లడయ్యాయి. అప్పట్లోనూ, జగన్‌ మీద నానా రకాల ఆరోపణలూ చేసేశారు టీడీపీ నేతలు. చిత్రంగా, టీడీపీకి చెందిన కొందరు నేతల పేర్లు, టీడీపీకి ఆర్థికంగా అండదండలందిస్తోన్నవారి పేర్లూ ఆ పేపర్స్‌లో వెల్లడయినా, వాటిని టీడీపీ లైట్‌ తీసుకుందనుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడు ప్యారడైజ్‌ వ్యవహారం తెరపైకొచ్చింది. ఇక్కడా, జగన్‌ పేరుని టీడీపీ అనుకూల మీడియా ప్రస్తావించింది.

అంతే, సీన్‌లోకి ఏపీ ఆర్థిక మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు రంగంలోకి దిగేశారు. జగన్‌ ఆర్థిక నేరస్తుడనీ, ఆ విషయం ప్యారడైజ్‌ పేపర్స్‌ ద్వారా వెలుగు చూసిందనీ ప్రకటించేశారాయన. తెలంగాణలో టీడీపీ ఎందుకు పలచనయ్యింది.? అన్న ప్రశ్నకు, టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రేవంత్‌రెడ్డే, ఏపీ టీడీపీ నేతలు.. మంత్రుల నిర్వాకం కారణంగానేనని తేల్చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ టీడీపీ మంత్రులు నడుపుతున్న ‘సఖ్యత’, తెలంగాణలో ప్రాజెక్టుల కాంట్రాక్టుల్ని, మద్యం వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్ని ఏపీ టీడీపీ నేతలు, ముఖ్యంగా మంత్రులు నడుపుతున్న విషయాన్ని రేవంత్‌ బయటపెట్టారు. అందులో యనమల పేరు కూడా వుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

ఆ సంగతి పక్కన పెడితే, గడచిన మూడున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌కి జాతీయ స్థాయిలో ఎన్నో ఘనమైన ప్రత్యేకతలు దక్కాయి. అవన్నీ అవినీతి, దోపిడీ వంటి విభాగాల్లోనే కావడం గమనార్హం. ఎక్కడో విదేశాల్లో ప్యారడైజ్‌ – పనామా పేపర్స్‌ అస్పష్టంగా పేర్కొన్న అంశాల్ని పట్టుకుని, జగన్‌ మీద విమర్శలు చేస్తోన్న టీడీపీ, తమ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిన వైనంపై జాతీయ స్థాయిలో వస్తున్న నివేదికల్ని మాత్రం పట్టించుకోదట.

చంద్రబాబు సర్కార్‌ దుబారా, ఆర్థిక మంత్రిగా యనమల చేతకానితనం.. వీటి కారణంగా ఖజానా లూటీ అయిపోతోందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. తమ వెనకాల ఇన్ని మచ్చలెట్టుకుని, ప్యారడైజ్‌ పేపర్స్‌ ప్రస్తావన తీసుకురావడమంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

టీడీపీ అధికారంలో వుంది గనుక, జగన్ ఆర్థిక నేరాలే నిజమైతే, సీబీఐ విచారణ అయినా కోరవచ్చు.. ఆ అవకాశం టీడీపీకి వుంది. కానీ, తమ ఆరోపణలో ’సరుకు‘ లేదని టీడీపీ నేతలకే బాగా తెలుసు. అందుకే, ఈ చవకబారు‘పచ్చ’ విమర్శలు. ఎనీ డౌట్స్.?


Recent Random Post: