
ఏపీలో ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ మరో వారం రోజుల్లో తన రాజకీయ జీవితానికి నలభై ఏళ్లు నిండుతాయని గొప్పగా, సంతోషంగా చెప్పుకున్నారు. ఇలా చెప్పుకోవడం తప్పుకాదు. ఎవరైనా సుదీర్ఘ రాజకీయ జీవితాన్నే కోరుకుంటారు.
ఆయనకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి లభించడం, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలగడం మొదలైనవన్నీ అదృష్టకరమైన విషయాలే. కాని ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలోనే నైతిక విలువలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన ముఖ్యమంత్రిగా కూడా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. దీన్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ఫిరాయింపుదారనే విషయం తెలిసిందే.
తాను వైసీపీ నుంచి టీడీపీలో చేరినప్పుడు రాజీనామా లేఖను స్పీకరు కోడెల శివప్రసాద్కు ఇచ్చానని, కాని ఆయన దానిపై ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఇలా చెప్పడం చంద్రబాబుకు కోపం తెప్పించింది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడవద్దని ఆదికి చెప్పాలని కొందరు నాయకులతో అన్నారు. ఆదినారాయణ రెడ్డి స్పీకరును ఇబ్బంది పెట్టారని, ఫిరాయింపుల అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణలో ఉందన్నారు. స్పీకరు చర్యలను ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని రాజ్యాంగం చెబుతున్నప్పుడు దీనిపై విచారణ ఏం జరుగుతుంది? ఫిరాయింపులపై త్వరగా నిర్ణయం తీసుకోండని స్పీకరుకు సూచిస్తుందే తప్ప దోషిగానో, నిర్దోషిగానో తీర్పు ఇవ్వదు కదా.
ఈ విషయం అలా ఉంచితే, వైసీపీ అసెంబ్లీని బహిష్కరించినందుకు ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆనందపడ్డారు. ఆ ఆనందంలో చంద్రబాబు సభకు ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యారో చూసుకోలేదు. వందశాతం ఎమ్మెల్యేలు హాజరయ్యారని సభలో పదేపదే చెప్పారు. కాని 74 మంది మాత్రమే హాజరైన విషయం ఆయనకు ఎందుకు తెలియలేదు? తెలియకుండా వందశాతం హాజరయ్యారని చెప్పారా? గొప్పలు చెప్పుకునే అలవాటుంది కాబట్టి తెలిసి కూడా చెప్పారా? తెలిసి చెప్పినట్లయితే ఆయన్ని భారతంలోని ధృతరాష్ట్రుడితో పోల్చాల్సిందే. దృతరాష్ట్రుడికి తనవాళ్లు చేసే అధర్మం గురించి తెలిసినా తెలియనట్లు నటించాడు. బాబూ అదే టైపనుకోవాలి.
మొదటిరోజు సభకు వందశాతం సభ్యులు హాజరుకాకపోయినా హాజరయ్యారని చెప్పుకోవడం చూసి కొందరు నాయకులు ఆశ్చర్యపోయారు. పలువురు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ విధానం ప్రకారం వైకాపా అసెంబ్లీ బహిష్కరణను వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆఫ్ ది రికార్డుగా సమర్థిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైందని, ఇది తమ పార్టీకి ఇబ్బందికరమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఫిరాయింపుదారుల్లో నలుగురిని మంత్రులను చేసినప్పటికీ మొత్తం ఫిరాయింపుదారులను ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా వైకాపా సభ్యులుగానే చూపించడాన్ని సీనియర్ టీడీపీ నాయకులు కొందరు పార్టీకి అవమానకరంగా భావిస్తున్నారు. నైతికంగా ఇది తప్పని ఆఫ్ ది రికార్డుగా బాధపడుతున్నారని ఆంగ్ల మీడియా సమాచారం. మొత్తం మీద చంద్రబాబు నాయుడు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నిస్సిగ్గుగా ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా, మంత్రి పదవులు కూడా ఇచ్చి వారు ఏ పార్టీ మంత్రులో తెలియకుండా చేశారు. తాను కలలు కన్నట్లుగా ప్రతిపక్షం లేని అసెంబ్లీని చూశారు.
Recent Random Post: