
కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తాడో లేదో తెలియదు.. కానీ, కమల్ రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఆయన అభిమానులైతే హడావిడి చేస్తూనే వున్నారు చాలాకాలంగా. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కమల్ పెట్టబోయే పార్టీ కోసం విరాళాలు అందించేందుకు ముందుకొచ్చేశారు. అలా వచ్చిన విరాళాల మొత్తం ఎంతో తెలుసా.? 30కోట్ల రూపాయలట. ఈ విషయాన్ని స్వయంగా కమల్ గతంలో ఓసారి వెల్లడించాడు.
అయితే, అప్పట్లో కమల్ 30కోట్ల విరాళం గురించి మాట్లాడితే అంతా ఆశ్చర్యపోయారు, నవ్వుకున్నారు. ఎంత అభిమానం వున్నాసరే, అసలంటూ పుడుతుందో లేదో తెలియని పార్టీ కోసం 30కోట్ల రూపాయలు ఎవరిస్తారబ్బా.? అని వెటకారం చేసినవారే ఎక్కువ. తమిళ రాజకీయాల్లో సినీ ప్రముఖుల హడావిడి తక్కువేమీ కాదు. కమల్ కంటే ముందు రాజకీయ రంగ ప్రవేశం చేసిన సినీ ప్రముఖుడు విజయ్‌కాంత్. రజనీకాంత్ తర్వాత అక్కడ అంతటి మాస్ ఫాలోయింగ్ వున్న స్టార్ హీరో ఆయన. అలాంటి విజయ్‌కాంత్ రాజకీయాల్లోకి వస్తానంటేనే, ఈ స్థాయిలో విరాళాలు వచ్చిపడలేదు. పార్టీ పెట్టాక కూడా విజయ్‌కాంత్ పార్టీకి అభిమానుల నుంచి అందిన విరాళాలు చాలా తక్కువేనట.
మరి, కమల్‌హాసన్ 30కోట్లు అని గతంలో ఎలా చెప్పాడు.? మళ్ళీ ఇప్పుడు ఆ విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, 30 కోట్లను తిరిగొచ్చేస్తానని ఎందుకు చెబుతున్నట్లు.? ఏమో, ఎవరికీ అర్థం కావడంలేదాయె. 30కోట్లు తన వద్ద వుంచుకోవడం ఇష్టం లేదన్నది కమల్ తాజా వ్యాఖ్యల సారాంశం. అంటే, ఇప్పటిదాకా ఆ మొత్తం ఆయనదగ్గరే వుందనుకోవాలి.
మామూలుగా రాజకీయ పార్టీలకు సంబంధించిన విరాళాలంటే, దానికో పద్ధతి వుంటుంది. కమల్ ఇప్పటికీ తన రాజకీయ పార్టీ ఏంటో చెప్పలేదు. మరి, అభిమాన సంఘాల తరఫున డిపాజిట్లు జరిగాయా.? ఆ డిపాజిట్ల అకౌంట్ల మాటేమిటి.? ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి రావాల్సి వుంటుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వమో, కేంద్ర ప్రభుత్వమో రంగంలోకి దిగితే మళ్ళీ రచ్చ షురూ అవకుండా వుంటుందా.? బహుశా కమల్ కోరుకుంటున్నది ఆ గందరగోళమేనేమో.!
Recent Random Post: