ముద్రగడ లాజిక్ లేని కోరిక!

ముద్రగడ పద్మనాభం అనే సీనియర్ నాయకుడు.. తాను కాపులకు రిజర్వేషన్ సదుపాయం కల్పించడం గురించి పోరాడుతున్నాడో లేదా.. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా చికాకు పెట్టడానికి పోరాడుతున్నాడో అర్థం కావడం లేదు. చూడబోతే.. కాపుల రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం ఏదైనా సానుకూల నిర్ణయం ప్రకటించేయబోతున్నదని, ముద్రగడకు ఏమైనా ప్రత్యేక సంకేతాలు అందాయో లేదో కూడా తెలియదు.

ఒకవేళ చంద్రబాబునాయుడు రిజర్వేషన్ ప్రకటించినా సరే.. ఆయనకు కాపు వర్గంలో పూర్తి మైలేజీ అందకుండా… అప్పటికీ కాపుల్లో కొంత అసంతృప్తిని మిగిల్చి ఉంచేలా.. ముద్రగడ కొత్త ఫిటింగులు పెడుతున్నారు. లాజిక్ కు అందని వాదనలతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అనిపిస్తోంది.

ఇన్నాళ్లూ కాపులకు బీసీ రిజర్వేషన్ వరకు మాత్రమే పరిమితమైన ముద్రగడ కోర్కె ఇప్పుడు కొంచెం మార్పు చేర్పులకు లోనైంది. బీసీలుగా చేయడంమాత్రమే కాదు. బీసీ కేటగిరీల్లో కాపులకు ఇచ్చే రిజర్వేషన్ ను ఒక ప్రత్యేక కేటగిరీగా గుర్తించాలని ఆయన కోరుతున్నారు. ఏబీసీడీలుగా ఉండే ఇతర కేటగిరీల్లో కలిపితే.. ప్రస్తుతం ఆయా కేటగిరీల్లో ఉన్న కులాలతో తాము కొట్లాడుతున్నట్లుగా పరిస్థితి తయారవుతుందని.. అలాంటి ఇబ్బంది రాకుండా.. తమకు ప్రత్యేక కేటగిరీ ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

చూడబోతే.. తమకు కేటాయించే కోటా మొత్తం పూర్తిగా తమకు మాత్రమే ఉండాలని.. మరెవ్వరూ దాన్ని పంచుకోవడానికి వీల్లేదని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇలా ఆయన ఎలా కోరితే ఎలా ఏర్పాట్లు చేయడం అనేది ప్రభుత్వానికి అంత ఈజీ కాకపోవచ్చునని.. ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చునని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం కాపుల మీద అధ్యయనానికి కమిషన్ పనిచేస్తోంది. వారు ఇచ్చే నివేదికను బట్టి కాపుల్లో కొన్ని కులాలను బీసీలుగా గుర్తిస్తారు. వారి స్థాయిని బట్టి ప్రస్తుతం ఉన్న కేటగిరీల్లో కలుపుతారు. వారికి మేలు జరిగేలా.. కాపుల కోటా కింద ప్రస్తుతం మినహాయింపు కోరుతున్న అందరికీ ఒకే తీరుగా ఒకే కేటగిరీలో రిజర్వేషన్ రాకపోవచ్చు కూడా.

నిజానికి ముద్రగడ అడుగుతున్నట్లుగా కాపులందరికీ.. ఒక ప్రత్యేక కేటగిరీని సృష్టించి ఇస్తేనే.. అందులో ఉండే ఉపకులాల విషయంలో.. చిన్న కులాల వారు దారుణంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇంత లాజిక్ లేని డిమాండ్లతో కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే డిమాండ్లు చేయాలన్నదే లక్ష్యం అన్నట్లుగా ముద్రగడ వ్యవహరిస్తున్నారనే మాటలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.


Recent Random Post: