అర్జున్ రెడ్డి రీమేక్ నేనే చేద్దాం అనుకున్నాను

తెలుగులో పాథ్ బ్రేకింగ్ మూవీగా పేరుతెచ్చుకున్న అర్జున్ రెడ్డి సినిమా తమిళ్ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. విలక్షణ నటుడు విక్రమ్ కొడుకు ధృవ్, ఈ రీమేక్ ప్రాజెక్టుతో హీరోగా అక్కడ పరిచయమౌతున్నాడు. ఇదిలా ఉండగా ఈ రీమేక్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు విక్రమ్. అసలు ఆ రీమేక్ లో తనే నటించాలని అనుకున్నానని ప్రకటించాడు.

“ధృవ్ ను అప్పుడే కోలీవుడ్ కు పరిచయం చేయడం నాకిష్టం లేదు. ఇంకొన్ని రోజులాగి వాడిని పరిశ్రమకు గ్రాండ్ గా పరిచయం చేద్దామనుకున్నాను. కానీ మా నాన్న ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి అర్జున్ రెడ్డి రీమేక్ ప్రాజెక్టులో నేనే నటించాలనుకున్నాను. కానీ మా నాన్న వద్దన్నారు. ఈ సినిమాతో మనవడు ధృవ్ ను కోలీవుడ్ కు పరిచయం చేయమన్నారు.” నాన్న మాట కాదనలేక, తనకు కలిసొచ్చిన బాల దర్శకత్వంలో ధృవ్ ను హీరోగా పరిచయం చేస్తున్నానని ప్రకటించాడు విక్రమ్.

స్కెచ్ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన విక్రమ్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ధృవ్ ను హీరోగా చూడకుండానే తండ్రి తమను వీడి వెళ్లిపోయాడని, తండ్రి కోరిక మేరకు ధృవ్ ను హీరోగా నిలబెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తానని అంటున్నాడు విక్రమ్. నటించడానికి మంచి స్కోప్ ఉన్న అర్జున్ రెడ్డి లాంటి సినిమాను అరంగేట్రానికి ఎంచుకున్న ధృవ్ పై చాలా ఒత్తిడి ఉందని చెప్పుకొచ్చాడు.


Recent Random Post: