త్రిష వ్యవహారంలో కొత్త మలుపు

అవసరానికి తగ్గట్లు సెలబ్రెటీలు ఎలా స్వరం మార్చేస్తారో చెప్పడానికి స్టార్ హీరోయిన్ త్రిష వ్యవహారమే ఉదాహరణగా చెప్పొచ్చు. పెటా కార్యకర్తగా గత కొన్నేళ్లలో త్రిష ఎలా ఉద్యమించేసిందో అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో పెటా కార్యక్రమాలకు బాగానే ప్రచారం చేసిపెట్టింది త్రిష. ఎక్కడైనా జంతువుల మీద అకృత్యాలు జరిగితే వాటి మీద వెంటనే స్పందించేది. బయట కూడా చాలా పెటా కార్యక్రమాల్లో పాల్గొందామె. చాలామంది హీరోయిన్లు పెటా ప్రచారకర్తలుగా ఉండటాన్ని ఒక హోదాగా భావిస్తారు. త్రిష కూడా అలాగే భావించింది ఇన్నాళ్లూ. కానీ ఆ హోదానే ఇప్పుడు తనకు పెద్ద గుదిబండగా మారుతుందని ఆమె ఊహించి ఉండదు.

జల్లికట్టుకు ప్రతికూలంగా మాట్లాడి త్రిష తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం.. వెంటనే తన ట్విట్టర్ అకౌంటును ఎవరో హ్యాక్ చేశారని మాట మార్చడం.. ఆపై మరిన్ని ఇబ్బందికర ఎదుర్కోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిష తల్లి తాజాగా మీడియా ముందుకొచ్చి.. చేసిన వ్యాఖ్యలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. త్రిష పెటాలో ఎన్నడూ అంత యాక్టివ్‌గా లేదని వ్యాఖ్యానించింది ఉమ కృష్ణన్. ప్రస్తుతం ఆమె పెటాకు దూరంగా ఉందని.. భవిష్యత్తులో ఆ సంస్థకు ప్రచారం చేయదని స్పష్టం చేసింది ఉమ.

జల్లికట్టును తన కూతురు ఎన్నడూ వ్యతిరేకించలేదని.. ఆమె కూడా తమిళ అమ్మాయే అని.. తమిళ సంస్కృతికి భంగం కలిగించే పని ఆమె చేయదని ఉమ పేర్కొంది. ఇకపై పెటాకు దూరంగా ఉంటుందన్న మాటలు ఓకే కానీ.. గతంలోనూ త్రిషకు, పెటాకు సంబంధం లేదన్నట్లు ఉమ మాట్లాడటమే విడ్డూరం.


Recent Random Post: