
పవన్ పై, అతడి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు, దానిపై ఓ సెక్షన్ మీడియాలో జరుగుతున్న చర్చలు గురించి అందరికీ తెలిసిందే. దీనిపై ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి నాగబాబు, అల్లు అరవింద్ స్పందించారు. ఎట్టకేలకు ఈ మేటర్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. తన ట్వీట్స్ ద్వారా సరికొత్త సంచలనానికి తెరదీశారు.
కొన్ని రోజులుగా తనపై, తన తల్లిపై జరుగుతున్న చర్చావేదికలు, రచ్చ మొత్తానికి తెరవెనక కారణం లోకేష్ అని ఆరోపించారు పవన్. కేవలం తన ప్రతిష్టను దిగజార్చేందుకు లోకేష్, అతడి స్నేహితుడు కలిసి పన్నిన ఉచ్చుగా దీన్ని చెప్పుకొచ్చారు పవన్.
రామ్ గోపాల్ వర్మ అనే ఒక దర్శకుడు, శ్రీసిటీ ఓనర్ (tv9 ఓవర్) శ్రీనిరాజు, టీవీ9 సీఈవో రవిప్రకాష్ కలిసి ఆడుతున్న నాటకమన్నారు పవన్. వీళ్లలో శ్రీనిరాజు ఒక్కరే ఈ మొత్తం వ్యవహారం నడిపించేందుకు 10కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వీరి ముగ్గురి ద్వారా లోకేష్, అతని స్నేహితుడు రాజేష్ కలిసి కొన్ని రోజులుగా తనపై ఈ కుట్ర చేస్తున్నారని పవన్ ఆరోపించారు.
పవన్ ఆరోపణలతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. లోకేష్ పై ఇప్పటికే అవినీతి ఆరోపణలు చేశారు పవన్. ఇప్పుడు తాజాగా జరుగుతున్న వ్యవహారం కూడా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు. తన ట్వీట్స్ లో నేరుగా వ్యక్తుల పేర్లు, డబ్బు ఎంతనే విషయాన్ని పవన్ ప్రస్తావించారంటే, అతని వద్ద పూర్తి ఆధారాలు ఉండే ఉంటాయి.
శ్రీరెడ్డి క్షమించమని వేడుకున్నా, వర్మ తప్పుచేశానని ఒప్పుకున్నా ఇవన్నీ తెరపైకి కనిపించేవి మాత్రమే. ఈ మొత్తం ఎపిసోడ్ వెనక కనిపించని చేతులున్నాయనే విషయాన్ని మొన్న నాగబాబు అనుమానం వ్యక్తంచేశారు. వాళ్లు ఎవరనే విషయాన్ని ఇప్పుడు పవన్ పేర్లతో పాటు బయటపెట్టారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే దీనిపై లోకేష్ స్పందించాల్సిందే. పవన్ తాజా ఆరోపణలపై టీడీపీ శ్రేణులు మరోసారి విరుచుకుపడతాయా లేక ఈసారైనా స్పష్టమైన ఆధారాల్ని చూపిస్తాయా అనేది చూడాలి.
Recent Random Post: