
ఇద్దరూ మంచి స్నేహితులే కావొచ్చు. కానీ సినిమాల విషయానికొచ్చేసరికి మాత్రం ఈమధ్య కాలంలో చిన్న పోటీ కనిపించింది. రంగస్థలం వసూళ్లను భరత్ అనే నేను సినిమా క్రాస్ చేసిందని చెప్పుకోవడానికి ఆ మూవీ నిర్మాతలు నానా హైరానా పడ్డారు. నమ్మకశ్యం కాకపోయినా వందల కోట్ల రూపాయలు వచ్చాయంటూ ఎప్పటికప్పుడు పోస్టర్లు విడుదల చేశారు. దీనిపై రామ్ చరణ్ స్పందించాడు.
“పోస్టర్లపై నంబర్ల వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. మేమంతా మంచి ఫ్రెండ్స్. మా అభిమానులు కూడా అంతే ఫ్రెండ్లీగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఓ మంచి వాతావరణం, మంచి పోటీ ఉండాలంటే ఇకపై పోస్టర్లపై వసూళ్లను చెప్పకూడదు. అందుకే ముందుగా నేను చొరవ తీసుకొని నిర్ణయం తీసుకుంటున్నాను. ఇకపై నా సినిమా పోస్టర్లపై వసూళ్ల వివరాలు ఉండవు.”
ఇలా ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ బాటలో మహేష్ లాంటి హీరోలు నడుస్తారా..? భవిష్యత్తులో తమ పోస్టర్లపై వసూళ్ల లెక్కల్ని చూపించకుండా ఉండగలరా..? మరీ ముఖ్యంగా బన్నీ లాంటి హీరోలు ఈ విషయంలో ముందుకొస్తారా..?
దువ్వాడ జగన్నాధమ్, సరైనోడు సినిమాల విషయంలో బన్నీ రిలీజ్ చేసిన వసూళ్ల పోస్టర్లు జనాలకు ఇప్పటికీ గుర్తే. ఈ విషయంలో మహేష్ కూడా తక్కువోడేం కాదు. డిజాస్టర్ అయిన స్పైడర్ సినిమాకే వసూళ్ల లెక్కలతో పోస్టర్లు విడుదల చేసిన ఘనత ఉంది.
ఏదేతైనేం, మొత్తానికి రామ్ చరణ్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇలా వసూళ్లను ప్రకటించడం వల్ల ఆడియన్స్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదంటున్న చరణ్.. కొన్ని సార్లు నిజాయితీగా కలెక్షన్లు చెప్పినా జనాలు అపార్థం చేసుకుంటున్నారని బాధపడ్డాడు.
“నిజానికి ఫిగర్లు చెప్పి జనాల్లో లేని ఫీలింగ్ తీసుకొస్తున్నామా అని కూడా అనిపిస్తుంటుంది. జనాలు వసూళ్లను విశ్లేషించే విధానం కూడా ఒక్కోసారి డిఫరెంట్ గా ఉండొచ్చు. మేం కొన్ని సార్లు నిజాయితీతో చెప్పే వసూళ్లను జనాలు అపార్థం చేసుకోవచ్చు కూడా. ఆ అవకాశం కూడా ఎందుకివ్వాలి అనిపిస్తోంది నాకు. అందుకే ఇకపై నా సినిమా పోస్టరలో వసూళ్ల లెక్కలు కనిపించకుండా జాగ్రత్తపడతాను.”
కేవలం తను నటించే సినిమాలకే కాకుండా, తన బ్యానర్ పై తెరకెక్కే సినిమాల విషయంలో కూడా నంబర్లను చూపించనని అంటున్నాడు చరణ్. మరి ఈ విషయంలో మహేష్, బన్నీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Recent Random Post: