
శ్రీకాకుళం పట్టణంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఉన్న దాదాపు అర ఎకరా స్థలాన్ని విక్రయించేశారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహననాయుడులు రంగంలోకి దిగడంతో ఎట్టకేలకు ఆ స్థలాన్ని విక్రయించగలిగారు. ఈ స్థలం అమ్మకం విషయంలో గత ఆర్నెళ్లుగా టీడీపీ నేతలు ఎవరికివారు పైచేయి సాధించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చి.. చివరకు అచ్చెన్నాయుడిదే అప్పర్ హ్యాండ్ అయింది.
శ్రీకాకుళంలోని బలగ ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సర్వే నెం.18/6,7,8లో 45.5 సెంట్లు స్థలం ఉంది. 2002లో దీన్ని పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కొన్నారు. అక్కడ భూమి పూజ చేసినా నిర్మాణం జరగలేదు. అయితే.. ఈలోగా పట్టణంలో కలెక్టరు ఆఫీసుకు 80 అడుగుల రోడ్డు ఒకటి కొత్తగా వేయడంతో ఆ ప్రాంతమంతా విశాలంగా ఉండడమే కాకుండా అభివృద్ధి చెందుతోంది.. ప్రభుత్వ కార్యాలయాలూ అటువైపే నిర్మితమవుతున్నాయి. దీంతో అక్కడ టీడీపీ కార్యాలయం(ఎన్టీఆర్ ట్రస్టు భవన్) నిర్మించాలని భావించారు. ఇప్పుడున్న స్థలాన్ని అమ్మేసి కొత్తగా 80 ఫీట్ రోడ్లో నిర్మించాలన్నది ప్లాన్. కానీ.. శ్రీకాకుళంలో మంచి ధరలు, గిరాకీ ఉన్నా కూడా చంద్రబాబు స్థలం కొనుగోలుకు మాత్రం ఎందుకో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో దాన్ని ఎవరికైనా అంటగట్టాలని నేతలంతా చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి రెడ్డి చిరంజీవి అనే వ్యక్తికి రూ.1.70 కోట్లకు విక్రయించారు.
ఫిబ్రవరి 2 లేదా 3న తొలి విడతగా రూ. 50 లక్షల రూపాయలు అడ్వాన్సుగా ఇవ్వాలంటూ ఆయనకు షరతు పెట్టారు. ఆ తరువాత మూడు నెలల వ్యవధిలో మిగిలిన మొత్తాన్ని చెల్లించేవిధంగా ఒప్పందం కుదిరింది. కాగా గత ఏడాది ఇదే చిరంజీవికి రూ.1.61 కోట్లకు ఇదే స్థలం విక్రయమైనా ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగడంతో డీల్ కుదిరింది.
Recent Random Post: