
2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ పెడితే.. మెగా అభిమానుల్ని తనవైపు వెళ్లొద్దని.. అన్నయ్య చిరంజీవితోనే ఉండాలని నాగబాబు పిలుపునివ్వడం గుర్తుండే ఉంటుంది. అప్పుడలా అన్న నాగబాబు ఇప్పుడు తనే ‘జనసేన’లోకి వెళ్లిపోయేలా ఉన్నాడు. తాను ఆ పార్టీ కోసం పని చేయబోతున్నానని వెల్లడించాడు నాగబాబు. 2019లో తన ఓటు పవన్ కళ్యాణ్‌కే అని కూడా నాగబాబు స్పష్టం చేయడం విశేషం. పవన్ మినహా ఎవరూ సరైన నాయకుడు కనిపించట్లేదని కూడా నాగబాబు వ్యాఖ్యానించడం విశేషం.
పవన్ మంచి మనిషని.. అతడికి సేవా దృక్పథం ఎక్కువని.. కుటుంబం కంటే కూడా సమాజానికే ప్రాధాన్యం ఇస్తాడని.. అతడికి అపారమైన విజ్నానం ఉందని.. విశాల దృక్పథం ఉన్నవాడని.. ఇలా తమ్ముడిలోని అనేక క్వాలిటీస్ గురించి చెప్పి అతడిని ఆకాశానికెత్తేశాడు నాగబాబు. పవన్ సీఎం అయిపోవడానికి జనసేన పార్టీ పెట్టలేదని.. ప్రజలకు నిబద్ధతతో సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాడని.. ఒకవేళ అతను సీఎం అయినా.. ప్రతిపక్ష పార్టీలో ఉన్నా.. సామాన్యులతో పాటే ఉంటాడని.. వాళ్ల కోసమే పని చేస్తాడని నాగబాబు అన్నాడు.
2019 ఎన్నికల విషయానికి వస్తే.. మంచి మనస్తత్వం ఉండి.. కమిట్మెంట్ ఉండి.. ప్రజల కోసం పనిచేసే.. రాజకీయాలపై చక్కటి అవగాహన ఉన్న నాయకుడిగా పవన్ తప్ప మరొకరు కనిపించట్లేదని.. తన ఓటు అతడికే అని స్పష్టం చేశాడు నాగబాబు. జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పని చేయడానికి తాను సిద్ధమని.. ఇందుకోసం తన ఓటును కూడా ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకోవాలనుకుంటున్నానని నాగబాబు వెల్లడించాడు.
Recent Random Post:

















