
టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో కె.రాఘవేంద్రరావు ఒకరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేయాల్సిన అవసరం లేని ప్రముఖుడిగా ఆయన్ను చెప్పాలి. అలాంటి ప్రముఖుడు తీసిన తాజా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. నాగార్జున హీరోగా తీసిన ఈ భక్తిరస చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. రాఘవేంద్రరావు సుదీర్ఘ కెరీర్ లో ఎప్పుడూ లేని ఒక పనిని తన తాజా చిత్రం కోసం చేసినట్లుగా చెప్పాలి.
ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసినప్పటికీ.. తన సినిమా విడుదలకు ముందు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన సినిమా గురించి ప్రమోట్ చేసుకోవటం రాఘవేంద్రరావు హిస్టరీలో లేదు. కానీ.. తన తాజా సినిమా కోసం ఆయనీ పని చేయక తప్పలేదు. నిర్మాణ వ్యయం పెరిగిపోవటం.. సినిమా ప్రచారం మీదనే ఓపెనింగ్స్ ఆధారపడి ఉండటం.. ఎంతటి వారైనా.. ప్రచారం చేయకపోతే సినిమాకు హైప్ క్రియేట్ కాదన్న వాదనకు రాఘవేంద్రరావు లాంటి వ్యక్తి సైతం తగ్గక తప్పలేదన్న మాట వినిపిస్తోంది.
తన తాజా చిత్ర విశేషాలతో పాటు.. ఆసక్తికర అంశాల్ని దాదాపు 77 నిమిషాల పాటు ఆయన చెప్పుకొచ్చారంటే.. తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది చెప్పకనే చెప్పొచ్చన్న మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఎవరి చేతిలో బందీ అయినా అవ్వకున్నా.. తాజా పరిణామం చూసినప్పుడు మాత్రం పెద్దాయన కాలం చేతిలో బంధీ అయ్యారన్న మాట వినిపిస్తోంది.
Recent Random Post: