మోహన్ లాల్ ప్లానింగ్ సూపరెహే..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ది దాదాపు మూడు దశాబ్దాల ప్రస్థానం. 90ల్లోనే ఆయన సూపర్ స్టార్ అయిపోయారు. తర్వాత ఎన్నెన్నో బ్లాక్ బస్టర్లలో నటించారు. అప్పుడప్పుడూ తమిళం.. హిందీలో నటించారు తప్ప తెలుగులో మాత్రం సినిమాలు చేయలేదు. ‘గాండీవం’లో ఒక పాటలో తళుక్కుమనడం మినహాయిస్తే ఇక్కడ ఏ క్యారెక్టర్ చేయలేదు.

కానీ గత ఏడాది అనుకోకుండా మనమంతా.. జనతా గ్యారేజ్ సినిమాల్లో నటించి మెప్పించిన లాల్‌కు ఇక్కడి ప్రేక్షకులు మంచి స్థానమే ఇచ్చారు. లాల్ ఎంతో నచ్చేయబట్టే ‘మన్యం పులి’ ఇక్కడ మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇటీవలే విడుదలైన ‘కనుపాప’లోనూ లాల్ నటనకు మన ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి.

దీంతో ఇకపై మోహన్ లాల్ ప్రతి సినిమా తెలుగులోకి వచ్చేసేలా కనిపిస్తోంది. ఇదే తరుణంలో లాల్ కూడా జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. తాను చేసే మలయాళ సినిమాల్లో టాలీవుడ్ నటీనటులకు ఛాన్సులిస్తున్నాడు. ఆల్రెడీ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్‌కు తాను కథానాయకుడిగా నటిస్తున్న ‘1971’లో అవకాశం కల్పించాడు. తాజాగా మరో సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశి ఖన్నాను నటింపజేస్తున్నాడు.

ఉదయ్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విశాల్ విలన్ పాత్ర చేస్తుండటం విశేషం. దీంతో ఈ చిత్రానికి అటు తమిళంలో.. ఇటు తెలుగులో క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడన్నమాట లాల్. ఈ సినిమా ఆటోమేటిగ్గా రెండు భాషల్లోనూ కొంచెం పెద్ద ఎత్తునే రిలీజవుతుందనడంలో సందేహం లేదు. లాల్ తీరు చూస్తుంటే ఇప్పుడు తెలుగులో పడ్డ పునాది మీద తన మార్కెట్‌ను పెద్ద స్థాయిలో విస్తరించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా ఉంది.


Recent Random Post: