బుల్లి తెరపై మొట్ట మొదట చేసిన కార్యక్రమంతోనే పాపులర్ అయిన నటి ‘కలర్’ స్వాతి. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో హీరోయిన్గా నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. అష్టాచమ్మా సినిమాతో ఆమె ఇమేజ్ బాగా పెరిగింది. కలర్ స్వాతి నుంచి అష్టాచమ్మా స్వాతిగా సాగించిన ప్రస్థానంలో… చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో అభిమానులను సంపాదించుకున్నారు.
కేవలం ఆమె ప్రతిభ నటనకే పరిమితం కాలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, గాయనిగా ఆమె రాణించారు. పెళ్లి తర్వాత చిత్రపరిశ్రమకు దూరమయ్యారు. అలాగే ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’ చిత్రం కోసం రాంగోపాల్ వర్మతో పని చేయడంపై ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘రాంగోపాల్‌వర్మకు ఆడవాళ్లంటే పిచ్చి అట కదా’ అని తనను నేరుగా ప్రశ్నించే వారని స్వాతి చెప్పారు. అలాగే ‘నిన్ను వర్మ తినేశారా? అసభ్య మెసేజ్‌లు పంపేవాడా’ అని కూడా మిత్రులు ఏ మాత్రం మొహమాటం లేకుండా తనను ప్రశ్నించేవాళ్లని గుర్తు చేసుకున్నారామె.
అందరూ భావించినట్టు రాంగోపాల్‌వర్మ తననెప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. ఒక్కసారి కూడా ఆయన అనవసర మాటలు తనతో మాట్లాడలేదన్నారు. పైగా వర్మ నుంచి తనకు ప్రశంసలు వచ్చాయన్నారు.
‘స్వాతి నువ్వు చాలా టాలెంట్ గర్ల్. నిన్ను చూస్తే రేవతి గారు గుర్తు కొస్తారు. మీరిద్దరూ ఎక్కువ ఆలోచిస్తారు. అలా చేయొద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లిపో అనేవాళ్లు. వర్మతో నాకు చాలా మంచి వర్క్ ఎక్స్పీరియన్స్. నా విషయంలో ఆయనెప్పుడూ గీత దాటి ప్రవర్తించలేదు’ అని స్వాతి చెప్పుకొచ్చారు.