దిల్ రాజు ఆ సినిమాను అందుకే కొన్నాడా?

ఎక్కడ తేడా వచ్చిందో కానీ.. దిల్ రాజుకు.. అక్కినేని నాగార్జునకు కొంత కాలంగా సంబంధాలు ఏమంత బాగున్నట్లు కనిపించట్లేదు. గత ఏడాది వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రవితేజతో చేయాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోతే.. అదే కథను నాగార్జునకు చెప్పి ఆయన్ని ఒప్పించాలని చూశాడు దిల్ రాజు. ఐతే నాగార్జున ఒప్పుకోలేదు. ఇటీవలే సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నాగార్జున హీరోగా దిల్ రాజు ఓ సినిమా చేస్తాడంటూ ప్రచారం జరిగితే.. దాని గురించి చాలా తేలిగ్గా మాట్లాడాడు నాగ్. ఈ నేపథ్యంలో రాజుకు.. నాగార్జునకు పడట్లేదన్న ప్రచారం ఊపందుకుంది.

ఇలాంటి తరుణంలో తన నిర్మాణంలో వచ్చిన ‘నేను లోకల్’ సినిమా థియేటర్లలో ఉండగానే నాగార్జున చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ నైజాం హక్కుల్ని దిల్ రాజు భారీ ధరకు కొని రిలీజ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నాగార్జునతో సంబంధాల సంగతి అలా ఉంచితే.. ఇది వేంకటేశ్వరుడి మీద తీసిన సినిమా కావడమే రాజు నైజాం రైట్స్ అంత రేటు పెట్టి తీసుకోవడానికి కారణమట.

వేంకటేశ్వరుడు దిల్ రాజు కుల దైవం. ఆయన మీద రాజుకు మహా గురి. తన బేనర్ కు ‘వేంకటేశ్వర క్రియేషన్స్’ అని పేరు పెట్టుకోవడమే కాదు.. తన ప్రతి సినిమా రిలీజ్ టైంలో రాజు తిరుమలలో ప్రత్యక్షమైపోతాడు. తలనీలాలు సమర్పిస్తాడు. ఈ నేపథ్యంలోనే వేంకటేశ్వరుడిపై ఉన్న భక్తితో సెంటిమెంటుగా భావించి ‘ఓం నమో వేంకటేశాయ’ హక్కుల్ని నైజాం ఏరియాకు తీసుకున్నాడట రాజు. ఐతే ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ.. వసూళ్లు ఆశించినట్లు రాలేదు. ఐతే పద్ధతిలో హక్కులు తీసుకోవడం వల్ల రాజుకు పెద్దగా నష్టమేమీ లేదని అంటున్నారు.


Recent Random Post: