విధి వెక్కిరించడమంటే ఇదేనేమో.! ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుని పాత అక్రమాస్తుల కేసు కొత్తగా వెంటాడుతోంది. స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నేత, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి దాదాపు పదిహేనేళ్ళ క్రితం చంద్రబాబు అక్రమాస్తులపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు అప్పటినుంచీ ఈ కేసులో ‘స్టే’ పొందుతూ వచ్చారు.
ఇన్నేళ్ళు ఓ కేసులో చంద్రబాబుకి ‘స్టే’ ఎలా లభించింది.? అని చాలా సందర్భాల్లో చాలామంది రాజకీయ నాయకులు అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇక, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులపై ఇప్పటికే నమోదైన చాలా కేసుల విచారణ వేగవంతం చేసే దిశగా అటు సర్వోన్నత న్యాయస్థానం, ఇటు కేంద్రం చర్యలు చేపట్టడంతో.. ఆయా కేసుల్లో విచారణ అత్యంత వేగం పుంజుకుంటోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు అక్రమాస్తుల కేసు కూడా త్వరితగతిన విచారణ పూర్తి చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
తాజాగా ఈ కేసుని విచారించిన న్యాయస్థానం, ఈ నెల 21వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా ,‘చంద్రబాబుని వదిలిపెట్టే సమస్యే లేదు.. చంద్రబాబుని జైలుకు పంపేదాకా విశ్రమించను..’ అంటూ లక్ష్మీపార్వతి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొత్తమ్మీద, ఆంధ్రప్రదేశ్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు.. ఇద్దరూ అక్రమాస్తుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు కేసులో వేగం పెరగడమే కాదు, వైఎస్ జగన్ మీద నమోదైన అభియోగాలకు సంబంధించిన కేసుల్లోనూ విచారణ వేగవంతమవుతుందనీ.. ఇద్దరూ జైలుకు వెళ్ళడం ఖాయమని సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టింగులు దర్శనమిస్తున్నాయి.
మొత్తమ్మీద, రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతోందేమోనన్న నమ్మకం అయితే ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యవాదుల్లో కనిపిస్తోంది. మొత్తమ్మీద, ‘నేను నిప్పు.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. అవి నన్నేమీ చెయ్యలేవు..’ అని వీలు చిక్కినప్పుడల్లా ఘీంకరించే చంద్రబాబు, ఇప్పుడేమంటారు.? వేచి చూడాల్సిందే.
Recent Random Post: