జనసేన పార్టీని నడపాలంటే.. దానికీ డబ్బులు అవసరం. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తిరిగి సినిమాల్లో నటించాలనుకున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో జనసేనాని లెక్కలు కొంతవరకు తప్పాయి. లేకపోతే, ఈపాటికి ‘వకీల్‌సాబ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసి వుండేది.. ఇంకో సినిమా నిర్మాణం దాదాపుగా పూర్తయ్యేదే. 2024 ఎన్నికల నాటికి రాజకీయంగా బలోపేతమవ్వాలంటే, ఈలోగానే సినిమాలు పూర్తి చేసేసి.. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టిపెట్టాల్సి వుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి. కానీ, పరిస్థితులు అనుకూలించడం లేదు. త్వరలో సినిమా షూటింగ్‌లో జనసేన అధినేత పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది.
ఇంకోపక్క, త్వరలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతున్నారనీ, ఓ మూడు జిల్లాల్లో ఆయన పర్యటనలుంటాయనీ, అయితే పార్టీ కార్యాలయాల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలకు మాత్రమే ఆయన టూర్స్ పరిమితమవుతాయనీ అంటున్నారు. ఓ సారి పొలిటికల్ టూర్ వేసేసి, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాకనే, సినిమా షూటింగుల్లో తిరిగి పాల్గొనాలన్నది జనసేనాని ఆలోచనగా కనిపిస్తోంది. ఇదివరకటి పరిస్థితులు కావిప్పుడు. షూటింగ్ పూర్తయ్యాక, విజయవాడకు వెళ్ళి రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టడానికి. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కరోనా నేపథ్యంలో అనేక ఇబ్బందులున్నాయి నిబంధనల రూపంలో. ఈ నేపథ్యంలోనే పక్కా ప్లానింగ్‌తో జనసేన అధినేత అటు రాజకీయాల వైపు, ఇటు సినిమాల వైపూ దాదాపుగా ఒకేసారి అడుగు వేయాలనుకుంటున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా, ఢిల్లీ పెద్దల నుంచి పవన్‌కి పిలుపొచ్చిందనీ, అతి త్వరలో ఆయన ఢిల్లీకి కూడా వెళ్ళబోతున్నారని అంటున్నారు. ‘కరోనా వ్యాక్సిన్ రాకుండా సినిమా షూటింగులు చేయడం కష్టం.. ఒక్కరి సమస్య కాదిది. టెక్నీషియన్స్‌కి ఏదన్నా సమస్య వచ్చినా, నటీనటులకు ఏదన్నా సమస్య వచ్చినా.. మొత్తం ఆగిపోతుంది..’ అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో ‘తిరిగి సినిమా షూటింగులు ప్రారంభమవడంపై’ అభిప్రాయం వ్యక్తం చేసిన జనసేనాని, మారిన పరిస్థితుల నేపథ్యంలో, ‘ఛాన్స్’ తీసుకోక తప్పేలా కనిపించడంలేదు.
Recent Random Post: