మాజీ మంత్రి నారా లోకేష్‌ని ‘పుష్ప మహరాజ్’గా అభివర్ణించారు మంత్రి అనిల్‌కుమార్ యాదవ్. కానీ, ఇదే అనిల్ కుమార్ యాదవ్‌ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ‘నోటి పారుదల శాఖ మంత్రి’ అని అభివర్ణించేసిందనుకోండి.. అది వేరే విషయం. ప్రాజెక్టులపై పెట్టాల్సిన శ్రద్ధ కాస్తా, ప్రత్యర్థుల్ని విమర్శించడంపై పెడతారు గనకనే బహుశా మంత్రిగారికి ఆ ‘బిరుదు’ వచ్చిందని అనుకోవాలేమో.! లేకపోతే, ఇప్పుడు నారా లోకేష్‌ని ‘పుష్ప మహరాజ్’ అనడం అవసరమా.? అన్న కనీస ఇంగితాన్ని ఎందుకు మంత్రి అనిల్‌కుమార్ మర్చిపోతారు.?
అక్కడ మేటర్ చాలా చాలా సీరియస్. 55 వేల కోట్లు ఖర్చయ్యే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు 25 వేల కోట్ల రూపాయల నిధులకి ‘కొర్రీలు’ వేస్తోంది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్. మామూలుగా అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఢిల్లీ వేదికగా ఉద్యమించాలి.. వైఎస్ జగన్ ప్రభుత్వమూ కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఓ వైపు ప్రభుత్వం, ఇంకో వైపు పార్టీ పరంగా నిరసన కార్యక్రమాలు జరుగుతుండాలి.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడైతే ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నిరాహార దీక్షలే చేసేశారు. మరి, ఇప్పుడు ఆ ‘పట్టుదల, చిత్తశుద్ధి’ ఏమైపోయాయ్.? ‘మోడీ సర్కార్, రాష్ట్ర ప్రజల్ని వంచించింది..’ అనడం చేతకావట్లేదు వైసీపీ నేతలకి. కానీ, తెలుగుదేశం పార్టీని విమర్శించడంలో ఒకరితో ఒకరు పోటీ పడిపోతున్నారు.
కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్.. ఇంకా పలువురు వైసీపీ మంత్రులు, నేతలు.. నారా లోకేష్ మీద విరుచుకుపడిపోతున్నారు.. అనవసరంగా ఇక్కడ నారా లోకేష్‌కి ‘జాకీలు’ వేస్తున్నారు వైసీపీ నేతలు. ఇది టీడీపీ – వైసీపీ మధ్య తెరవెనుకాల నడుస్తున్న ‘60-40’ ఒప్పందానికి నిదర్శనమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తిట్టిపోస్తున్నారాయె.!
నీటి పారుదల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్, పోలవరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రగడపై బాధ్యతాయుతంగా స్పందించాల్సి వుంది. కేంద్రంపై తిట్ల దండకం అందుకోవాల్సిన పనిలేదు.. కేంద్రాన్ని డిమాండ్ చేయాలి కదా.! ఇంకా నయ్యం.. అంత సీన్ వైసీపీకి వుంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేది. ప్రతిపక్షంలో వున్నప్పుడైతే పబ్లిసిటీ కోసం పదవులకు రాజీనామా చేస్తారుగానీ.. అధికారంలోకి వచ్చారు కదా.. ఇప్పుడెందుకు నోరు పెగులుతుంది.?